వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగినా.. పార్టీకి నష్టం కలిగిందని వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వల్ల నాయకులు, కార్యకర్తల మధ్య దూరం పెరిగిందన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అందరు నాయకుల్లోను ఇదే అభిప్రాయం ఉందన్నారు.
కూటమి ప్రభుత్వంపై మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నారని.. వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి చెందామని.. దానికి గల కారణాలను పార్టీ విశ్లేషించుకుంటోందని.. నియోజకవర్గ స్థాయిలో నాయకులతో మీటింగ్‌లు పెట్టుకోని వివరాలు సేకరిస్తామన్నారు. కార్యకర్తల, నాయకుల సమస్యలపై పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజకీయ పార్టీలకు బౌన్స్ బ్యాక్ కావడం కొత్తేం కాదని.. మళ్లీ పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి కార్యక్రమాలను ఈనెల ఎనిమిదో తేదీన ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాటు చేస్తున్నామని.. రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.