కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అంతు చూస్తామని ప్రతిపక్షంలో వుండగా పవన్‌కల్యాణ్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో వుంది. కాకినాడలో ద్వారంపూడి కూడా ఓడిపోయారు. గతంలో ఆ ప్రాంతంలో పవన్‌కల్యాణ్ పర్యటించినప్పుడు… ద్వారంపూడిని కొట్టుకుంటూ, ఈడ్చుకెళ్తానని ఘాటు హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అధికారంలో ఉన్న జనసేన… ద్వారంపూడి అంతు చూడాలనే పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాపారాన్ని దెబ్బ కొట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తహతహలాడుతున్నారు.
ప్రధానంగా చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయల్ని ద్వారంపూడి సంపాదిస్తున్నారనేది పవన్, నాదెండ్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా చౌక బియ్యం అమ్మక వ్యాపారాన్ని బిగిస్తే, ద్వారంపూడిని దెబ్బ తీయొచ్చని నాదెండ్ల వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మీడియాతో నాదెండ్ల మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబ అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్నారు. చౌక బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించడం గమనార్హం. కలెక్టర్‌తో విచారణ చేయిస్తామని ఆయన అన్నారు. పారదర్శకంగా, విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలనేది తమ ఆలోచనగా ఆయన చెప్పారు.