చాన్నాళ్లకి జగన్ నోరు విప్పారు

మొత్తానికి మంచికో, చెడ్డకో మాజీ సీఎం వైఎస్ జగన్ నోరు విప్పారు. మీడియా మైకుల ముందు మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. నెల్లూరు జైలులో పిన్నెల్లిని పరామర్శించిన తరువాత జగన్ అక్కడకు చేరిన…

మొత్తానికి మంచికో, చెడ్డకో మాజీ సీఎం వైఎస్ జగన్ నోరు విప్పారు. మీడియా మైకుల ముందు మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. నెల్లూరు జైలులో పిన్నెల్లిని పరామర్శించిన తరువాత జగన్ అక్కడకు చేరిన మీడియా ముందు కాస్సేపు మాట్లాడారు.

ఈ మాటల్లో కీలకమైనవి రెండు. వైకాపా శ్రేణులపై దాడులను ఖండించడం. ఇలా చేస్తే, భవిష్యత్ లో తాము కూడా ఇలాగే చేసే పరిస్థితి వుంటుందని హెచ్చరించడం. రెండవది, చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేయడం.

కేవలం పదిశాతం మంది వరకు తెలుగుదేశం వాగ్దానాలను నమ్మడం వల్లనే వైకాపాకు ఓటమి సంభవించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు అదే మీడియా ముందు స్పష్టం చేసారు. జగన్ తన పాలన మీద పూర్తి భరోసాగా వున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికీ. కేవలం తెలుగుదేశం పార్టీ తమను మించిన వాగ్దానాలు ఇవ్వడం వల్లనే గెలిచింది తప్ప వేరు కాదని జగన్ నమ్ముతున్నారు.

ఆ వాగ్దానాలు కనుక తెలుగుదేశం నిలబెట్టుకోకపోతే, మళ్లీ వైకాపా వైపు జనం మొగ్గుతారని జగన్ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పిన్నెల్లి విషయంలో ఏం జరిగింది అన్నది వీడియోల సాక్షిగా జనం అంతా చూసారు. ఈవిఎమ్ లను పిన్నెల్లి పగలగొట్టిన వీడియోలు బయటకు రాకుండా వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కానీ ఇప్పుడు పిన్నెల్లిని జగన్ సమర్దించినా జనం నమ్మడం కష్టం.

అంతకన్నా రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న దాడులను ఖండించడం మంచింది. వాటి విషయంలో బలంగా నిలబడాలి. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లాలి. అప్పుడు జనం జగన్ కు మద్దతు ఇస్తారు. పిన్నెల్లి విషయంలో నైతిక మద్దతు ఇవ్వడం వరకు కరెక్ట్ నే. అంతకు మించి మాట్లాడే అవకాశం జగన్ కు లేదు. కానీ పిన్నెల్లి పరిస్థితుల వల్ల, అక్కడ అరాచకం వల్ల, లోపలికి వెళ్లి ఈవిఎమ్ పగలగొట్టారు అనే అర్థం వచ్చేలా జగన్ మాట్లాడారు.

మొత్తం మీద ఏమైతేనేం జగన్ గొంత పార్టీ శ్రేణులకు వినిపించింది. ఇది అత్యంత అవసరం రాజకీయాల్లో హత్యలు వుండవు. ఆత్మహత్యలే అంటారు అనుభవజ్ఙులు. జగన్ నిత్యం బయటకు వచ్చి ప్రభుత్వం మీద పసలేని విమర్శలు చేయాల్సిన పని లేదు. కానీ వీలయినపుడు, అవసరం వున్నపుడు, అవకాశం దొరికినపుడు తన గొంతు బలంగా వినిపించి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడం మాత్రం చాలా అవసరం.