తెలంగాణ ముఖ్యమంత్రి హామీలపై బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ హామీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అనడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏపీ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ భేటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరూ గురుశిష్యులనే ముద్ర వుండడంతో అసలేం జరుగుతుందనే చర్చకు తెరలేచింది. ఈ పరంపరలో భేటీపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డి హామీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్, దీపాదాస్ మున్సీ మధ్యలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోతోందన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలని తాము కూడా కోరుకుంటున్నామని ప్రభాకర్ తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే చంద్రబాబుతో భేటీకి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చిందా? లేదా? అనేది తెలియడం లేదన్నారు.
ఏ క్షణాన్నైనా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం రద్దు కావచ్చని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి పాలిస్తున్నారా? లేక ఢిల్లీ అధిష్టానం పాలిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.