కల్కి తర్వాత మైథాలజీని మిక్స్ చేయడం హిట్ ఫార్ములా అని ఒక డైరెక్టర్ నమ్మాడు. కాకపోతే ఆయనకి తిరుమల బాలాజీ తప్ప మైథాలజీ తెలియదు. భారతం ముందు పెట్టుకుని ఒకసారి తడిమి, రెండు సార్లు పేజీల్ని గిర్రున తిరిగేసాడు. సినీ రంగం గొప్పతనం ఏమంటే చాలా మందికి బ్రెయిలీ వచ్చు. దేన్నైనా ఇలా తడిమి అలా అనర్ఘళంగా మాట్లాడగలరు. గంటలో కాపీ కొట్టేసి దశాబ్ద కాలంలో ఆ కథ మీద పని చేస్తున్నానని ఘంటాపధంగా చెప్పగలరు. పిడిగుద్దులతో అన్ని కళల్ని నేలకూలుస్తూ కళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకోగలిగే ఉద్ధండుల సంఖ్యని లెక్కించలేం.
నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్ని కళలు డబ్బు అనే మురిక్కాలువలో కలిసిపోతాయి. మన మిక్సీ డైరెక్టర్‌కి ఈ సత్యం బాగా తెలుసు. అందుకే ఆయన ఎవరికీ డబ్బులీయడు.
పురాణ ఆలోచన వచ్చిన వెంటనే నలుగురు తలమాసిన రచయితల్ని పిలిపించాడు. వీళ్లతో సౌకర్యం ఏమంటే సొంత ఖర్చులతో వచ్చి డబ్బులడక్కుండా చర్చల్లో పాల్గొని చివరికి ఒక సెల్ఫీ తీసుకుని వెళ్లిపోతారు. దాన్ని ఫేస్బుక్లో పెట్టి 232 లైక్స్, 36 కామెంట్స్ సంపాదించి రాత్రి సంతోషంగా నిద్రపోయి మరుసటి పోస్టింగ్ కోసం కలలు కంటారు.
అందరూ కలిసి కథ మీద కూచున్నారు. చాలా సినిమాల్లో శుభం కార్డు వరకూ కథ పైకి లేవకపోడానికి కారణం దాని మీద అనేక మంది కూచుని చితక్కొట్టడమే.
“ఇపుడు ప్రేక్షకులకి వినోదం కంటే పురాణం అవసరం. అందుకనే భారతం బయటికి తీద్దాం” చెప్పాడు డైరెక్టర్.
“భారతం పురాణం కాదు, ఇతిహాసం” అన్నాడో తెలివైన రైటర్.
ఆ పదాన్ని డైరెక్టర్ గత జన్మలో కూడా వినలేదు. కానీ కవర్ చేయడమే టేకోవర్ లక్షణం.
“ఇతిహాసాన్ని అతిహాసం చేస్తేనే సినిమానే” అన్నాడు.
“తెలుగు సినిమాల్లో వుండేదే అతి. మళ్లీ మీరు కొత్తగా చేసేదేముంది?” అడిగాడో రచయిత.
“కొత్తగా ఏమీ చేయం. పాతదాన్నే కొత్తగా చెబుతాం”
దర్శకుడి మాటలు అర్థం కాక రచయితలు మాసిపోయిన బుర్ర గోక్కున్నారు.
“కల్కిలో అశ్వత్థామ కథ చెప్పినట్టు మనం ధృతరాష్ట్రుడి కథ చెబుతాం. మైథాలజీకి సైకాలజీని జోడించి మైథోసైకలాజికల్ థ్రిల్లర్ అని పేరు పెడదాం” ఉత్సాహంగా చెప్పాడు డైరెక్టర్.
మైథోసైకలాజికల్ అనే పదం స్థిరీకరణ చేసినందుకు రచయితలంతా సంతోషించి ఒక కప్పు చక్కెర లేని టీ తాగారు. రచయితలకి పొగరుతో పాటు సుగర్ కూడా వుంటుంది. వీళ్లని డయాబెటిక్ ఇంటలెక్చువల్స్ అంటారు.
“ధృతరాష్ట్రున్ని లోకం చూసింది కానీ, లోకాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. అంధుడు. ఆయనకి కథ ఏముంటుంది?” అడిగాడో తెలివైన రచయిత.
“ధృతరాష్ట్రుడికి కళ్లు లేవని ఎవరు చెప్పారు?” అన్నాడు దర్శకుడు.
ఆ మాటతో ప్లగ్‌లో వేలు పెట్టినట్టు రచయితలంతా చిగురుటాకుల్లా వణికి తమాయించుకున్నారు.
“ఇది మేమెక్కడా చదవలేదు” అన్నారు.
“ఎక్కడా లేదు. నేనే సృష్టించాను, ఈ ప్రపంచంలో కళ్లున్న వాళ్లంతా చూడలేరు. దృష్టికి , అంధత్వానికి పెద్ద తేడా లేదు. ఇపుడు ఇక్కడున్న నలుగురిలో ఇద్దర్ని నేను కసకసా పొడిస్తే మిగిలిన ఇద్దరు పారిపోతారా? ఈ హత్యను మేము చూశామని చెబుతారా?”
దర్శకుడి సైకో ఎనాలసిస్‌కి రచయితలు బిక్కచచ్చి కర్రల్లా బిగుసుకు కూచున్నారు.
“ధృతరాష్ట్రుడికి కళ్లున్నా గుడ్డివాడిలా నటించాడు. ఈ ప్రపంచం తన ముందు ఎలా నటిస్తూ వుందో తెలుసుకోవాలని అతని కోరిక. ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి తనలో తాను మాట్లాడుకుంటూ వుంటాడు”
“అద్దం ముందు ఎందుకు?”
“సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ లేదా లిబర్టీ అంటారు. రెండు వైపులా పదును వుంటేనే దాన్ని సినిమా కత్తి అంటారు”
“జనానికి అర్థం కాదేమో!”
“కల్కీ అర్థమైందా? చూసారా? లేదా? బావుందని రాసారా లేదా? అందరికీ అర్థమైన దాన్ని, ఎవడికీ అర్థం కాలేదని, ఎవడికీ అర్థం కానిది అందరికీ అర్థమైందని రాయడమే విమర్శకుల ప్రాథమిక లక్షణం”
“ఇంతకీ సినిమాలో ఏం చెబుదాం?”
“చెప్పం, చూపిస్తాం. సినిమా అంతా డిమ్లైట్లో వుంటుంది. కొన్ని సీన్లలో కంప్లీట్ డార్క్నెస్. ధృతరాష్రుడి పాయింట్ ఆఫ్ వ్యూ. చివరికి ఈ లోకంలో కళ్లు లేకపోవడమే నిజమైన అదృష్టమని గ్రహించి ఫిలసాఫికల్ టచ్‌తో ముగిస్తాం”
“ప్రేక్షకులు పారిపోతారేమో?”
“గేట్లకి గాడ్రేజ్ తాళాలు బిగిస్తాం. రావడమే వాళ్లిష్టం. పంపడం మన చేతుల్లో పని. ఈ సినిమా స్పెషాలిటీ ఏమంటే 3డీ అద్దాలు ఇచ్చినట్టు ప్రతి వాడికీ గంతలు ఇస్తాం. చూడడం ఇష్టం లేకపోతే గంతలు కట్టుకోవచ్చు. ప్యూచర్ విజన్, ఆడియన్స్ కన్ఫ్యూజన్కి సింబాలిక్‌గా వుంటుంది” ఆనందంగా చెప్పాడు దర్శకుడు.
రచయితలు కొంచెం భయంగానే లేచి ఇక వెళ్లిపోతాం అన్నారు.
“రేపటి డిస్కషన్లో అందరూ వెరైటీగా కళ్లకి గంతలతో కథ మీద కూచుందాం”
సెల్ఫీ కూడా మరిచిపోయి రచయితలు పారిపోయారు.
“ఆపరేషన్ ధృతరాష్ట్ర” టైటిల్ ఖరారు చేసుకున్నాడు డైరెక్టర్.
జీఆర్ మహర్షి