నిజాయితీలో భారతీయుడి సినిమాలో కమల్‌హాసన్ పాత్ర పోషిస్తానని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అంటున్నారు. అనడమే కాదు, ఆచరిస్తానని ఆయన హుషారుగా చెప్పడం విశేషం. ఇవాళ ఆయన ప్రొద్దుటూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి మందీమార్బలంతో వెళ్లారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిలో వణుకు మొదలైంది.
సబ్ రిజిస్ట్రార్ రత్నమ్మ కార్యాలయంలోకి వరదరాజులరెడ్డి నేరుగా వెళ్లారు. కార్యాలయంలో అవినీతి జరుగుతోందని రత్నమ్మపై ఫైర్ అయ్యారు. కార్యాలయ సిబ్బందిని ఎమ్మెల్యే పిలిపించుకున్నారు. వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తెప్పించారు. రత్నమ్మతో పాటు కార్యాలయ సిబ్బందితో తాము అవినీతికి పాల్పడమని ప్రమాణం చేయించారు. ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి జరిగితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించడం గమనార్హం.
అవినీతికి సబ్ రిజిస్ట్రార్, పోలీస్, రెవెన్యూ కార్యాలయాలు నిలయాలని జగమెరిగిన సత్యం. అవినీతిని నిర్మూలిస్తే మంచిదే. అయితే కేవలం సొంత పనులు చేయించుకోడానికి మాత్రమే అధికారులపై నాయకులు దబాయింపులకు దిగుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరదరాజులరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పలుమార్లు హెచ్చరించడం వివాదాస్పదమైంది.
ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే కావడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయపెడుతున్నారు. ఈ భయం అవినీతికి పాల్పడకుండా ఉండడానికి ఉపయోగపడితే ప్రజలు అభినందిస్తారు. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వాడుకుంటే మాత్రం చెడ్డపేరు వస్తుంది.