మెజారిటీలు…మెజారిటీలు! స్పష్టమైన మెజారిటీలు.. తిరుగులేని మెజారిటీలు.. బ్రూట్ మెజారిటీలు!
జనం ఇంతింత మెజారిటీలు ఇచ్చి పార్టీలకు చట్టసభలకు పంపితే ఏం చేస్తున్నారు..? ఉన్న ఊపిరి తక్కువ వైరి పక్షాలను చంపేస్తున్నారు. ప్రతిపక్షసభ్యులను చిన్నబుచ్చుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లతో వారిని అడ్డంగా కొనేస్తున్నారు. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ ఇదే తంతు.
మెజారీటీ ఇస్తే.. రాజ్యాంగ సంస్థలను కీలుబొమ్మల్ని చేశారు. దర్యాప్తు సంస్థల్ని కుళ్ళబొడిచారు. న్యాయవ్యవస్థకు వెన్నువిరిచారు. మీడియా సంస్థల నోళ్ళు నొక్కారు. శత్రు పక్షనేతల్ని జైళ్ళలో వేశారు.
అణగారిన వర్గాలను అధఃపాతాళానికి తొక్కేశారు. రైతులు యేడాదికి మించి హస్తిన లో బైఠాయిస్తే, వారి మీద ‘ఉగ్రవాద‘ ముద్ర వేశారు. ఆదివాసులు అడవి తమదేనని బహుళ జాతి సంస్థల్ని అడ్డుకుంటే, వారి నుదుటున ’తీవ్రవాద‘ తిలకం దిద్దారు. విద్యార్థులు క్యాంపస్ దాటితే, మింగితే నిరుద్యోగ రాక్షసిని వదిలారు. పొరపాటున పోటీ పరీక్షకు వెళ్ళితే వాళ్ళకు ’లీకులు‘ మేకులయ్యాయి.
తాము ఆడిరది ఆట.. పాడిరది పాట అనుకున్నారు. కానీ.. ఒక విషయాన్ని మరిచారు. ఒక దిగంబర కవి అన్నట్లు, ‘చరిత్ర నిద్రాసముద్రం నుంచి పెను తుఫానుగా లేవగల‘ అస్త్రం వుందని మరిచారు. అదే రాజ్యాంగం! ‘ఆపద వచ్చినప్పుడు ప్రయోగించరా బిడ్డా..!’ అని సాక్షాత్తూ అంబేద్కరే రాసి, రాజ్యాంగసభతో ఆమోదముద్ర వేయించి, వోటరు చేతిలో పెట్టాడు. అవును. అది నిజంగా పాశుపతాస్త్రమే.
ఆగి ఆగి, వేచి వేచి, చూసిచూసి అతడు ప్రయోగించాడు. కార్పోరేట్లకు సంచులిచ్చి, పేదల ముఖాన పించన్లు కొట్టిన నడమంతరపు నియంతలు గిలగిల లాడారు.
వారిని గెలిపించలేదు. ఓడిరచలేదు. మధ్యన వుంచాడు. గెలుపులో ఒటమి, ఓటమిలో గెలుపు. అది స్వర్గమూ కాదు, నరకమూ కాదు. త్రిశంకు స్వర్గం. అదే 18వ లోక్ సభ. ఓడి గెలిచింది ఇండియా ప్లస్. గెలిచి ఓడిరది. ఓడిన వారు సంబర పడ్డారు. గెలచిన వారు శోకించారు.
మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అయ్యారు. రికార్డే. కానీ చరిత్ర కాదు. కారణం మూడోసారి వచ్చిన మోడీలో, అసలు మోడీ కనిపించరు. తగ్గాలి, ఒదగాలి, సర్దుకు పోవాలి. మూడూ మోడీకి అలవాటు లేని పనులు. నిజం కళ్ళముందు కనిపిస్తున్నా, నమ్మటానికి సమయం పడుతుంది. లోక్ సభ కొలువు తీరగానే ఈ పరిణామాలు ఎదురుయ్యాయి. లోక్ సభ అసలు స్పీకర్ ఎన్నిక తర్వాత సంగతి.
ప్రమాణ స్వీకారపు తంతు నడిపించే తాత్కాలిక స్పీకర్ ( ప్రొటెం స్పీకర్) దగ్గరే ప్రతిపక్షం తన గొంతులేపింది. అదే సభలో ఎక్కువ సార్లు ప్రాతినిథ్యం వహించిన సభ్యుడికి ఈ బాధ్యత నివ్వాలి. ఆ లెక్కన చూస్తే, ఎనిమిదవ సారి లోక్ సభకు ఎన్నికయిన ఏకైక సభ్యుడు కొడికున్నీల్ సురేష్. అంతే కాదు ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. కానీ, ఆయన్ని ఒకే ఒక్క కుంటి సాకుతో పక్కన పెట్టి, అంతకన్నా తక్కువ సార్లు (తాజాగా ఏడవ సారి) మాత్రమే ఎన్నికయన భర్తృహరి మహ్తాబ్ ను బీజేపీ (ఎన్డీయే) ఎంపిక చేసింది. పార్టీల పరంగా చూస్తే సురేష్ కాంగ్రెస్ మనిషి. భర్తృహరి బీజేపీ వాడు.
ఇంకా స్ఫష్టంగా చెప్పాలంటే, కప్పుకున్న కాషాయ కండువా నలగని వాడు. (ఆయన 2024 ఎన్నికలకు ముందే బిజూ జనతా దళ్ నుంచి, బీజేపీలోకి వచ్చారు). మరి సురేష్ ను ఎందుకు ఎంచుకోలేదూ? ప్రతిపక్షసభ్యుడనా? అలాంటి నిబంధనేమీలేదే? కానీ బీజేపీ అధినాయకత్వం లేవ దీసిన అభ్యంతరం ఒక్కటే: సురేష్ ఎనిమిది సార్లు లోక్ సభ సభ్యుడిగా గెలిచిన మాట నిజమే కానీ, వరుసగా (నిరంతరాయంగా) గెలవలేదు. భర్తృహరి మహ్తాబ్ ఏడుసార్లు గెలిచినా నిరంతరాయంగా గెలిచాడు. ఇలాంటి నిబంధన కానీ, ఆనవాయితీ కానీ ఎక్కడా లేదు.
అయినా బీజేపీ అధికార పక్షం తన వాదనే గెలుస్తుందని కాస్సేపు భావిద్దాం. బీజేపీ నుంచే ప్రోటెం స్పీకర్ ను ఎంచుకునే అవకాశం వుందని కూడా నమ్మేద్దాం. అప్పడు వరుసగా ఏడు సార్లు ఎన్నికయన వారిలో బీజేపీ సభ్యుడు ఒక్క భర్తృహరి మహ్తాబేనా? ఇంకెవరయినా బీజేపీ సభ్యుడు వున్నాడా? ఉన్నాడు. ఆయన పేరు రమేష్ చందప్ప జిగజినాగీ. ఈయనకూడా భర్తృహరిలాగే ఏడు సార్లు నిరంతరాయంగా గెలుపొందారు. మరి ఈయన పేరును బీజేపీ ఎందుకు ముందుకు తేలేదూ..? రమేష్ చందప్ప కూడా బీజేపీ నేతే కదా! ఎందుకు ఆయన్ని పరిగణించలేదంటే.. ఆయన కూడా దళితుడే. బీజపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు అని అనుకోవాలా..? ఈ ప్రశ్న కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ తన ’ఎక్స్‘ ఖాతా లో ప్రశ్నించారు. ఆమేరకు ఆయన లోక్ సభ వెబ్ సైట్ లోని ఈ ఇద్దరి సభ్యుల వివరాల స్క్రీన్ షాట్ నీ షేర్ చేశారు.
అంటే తమ సొంత పార్టీలోని సభ్యుడయినా సరే, అదే సీనియారిటీ వున్నా దళితుడయితే చాలు పక్కన పెట్టేస్తారా? ఈ చర్చమొత్తం దేశం ముందు వుంచేశారు. ఇక అసలు స్పీకర్ కు విపక్షం పోటీ పెట్టడంలో వింతేముంది? విపక్ష స్వరం ఇంత స్పష్టంగా వినిపిస్తుందంటే, అది సంకీర్ణ సభ పుణ్యమే!
అయితే విపక్షం తనపట్టును అక్కడతే ఆగలేదు. సభ్యుల ప్రమాణం పూర్తయ్యాక, అసలు స్పీకర్ ఎన్నిక విషయం వచ్చింది. బాదాపు ప్రతీ సారీ పాలక పక్షం ఎంపిక చేసిన సభ్యుణ్ణే సభ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. పైపెచ్చు బీజేపీ (ఎన్డీయే) పాత స్పీకర్నే మళ్ళీ ముందుకు తెచ్చింది. గత (17వ) సభలో స్పీకర్ గా వున్న ఓం బిర్లానే మళ్ళీ స్పీకర్ గా ప్రతిపాదించింది. విపక్షం ఆనవాయితీని దెబ్బతీసింది. ప్రోటెం స్పీకర్ గా ప్రతిపాదించిన దళిత నేత కొడికున్నీల్ సురేష్ నే ఇండియా ప్లస్ అభ్యర్థిగా దించింది. దాదాపు అర్థ శతాబ్దం తర్వాత స్పీకర్ కు పోటీ జరిగింది.
ఎప్పుడో 1976లో బలరామ్ భగత్ కీ జగన్నాథ్ రావుకీ మధ్య పోటీ జరిగింది. అంతకు ముందు 1952లో జరిగింది. అప్పుడు పోటీ జీవీ మవలంకర్ కీ, శంకర్ శాంతారామ్ కీ మధ్య జరిగింది. మళ్ళీ ఇప్పుడు పోటీ అనివార్యం అయ్యింది. గెలుపు ఓం బిర్లాదే కావచ్చు. కానీ విపక్షంగా ఎంత గట్టిగా వుందో చెప్పింది. ఇది బీజేపీకి చెంప పెట్టే. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ. ఆ ఆనవయితీని పాలక పక్షం తప్పింది కాబట్టి. స్పీకర్ పదవికి విపక్షం ఎన్నిక పెట్టింది.