టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో 16 వేల పై దాటి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రకటన చేసింది. మెగా డీఎస్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలోగా పోస్టులు ఇచ్చేలా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
అయితే దీని మీద మాజీ విద్యా శాఖ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బిగ్ క్వశ్చన్ వేశారు. రాష్ట్రంలో అసలు ఉన్నవే ఆరు వేల ఉపాధ్యాయ ఖాళీలు అయినపుడు 16 వేల పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారో తనకు తెలియడం లేదని బొత్స అంటున్నారు. తాము ఖాళీలు ఉన్న మేరకే నోటిఫికేషన్ ఇచ్చామని దానిని రద్దు చేయడమేంటి అని ఆయన అంటున్నారు.
ఏపీలో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగేలా పరిస్థితులు ఉన్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. వరసగా వైసీపీ పార్టీ ఆఫీసుల మీద దాడులు జరగడం అలాగే విశ్వవిద్యాలయాలలోకి రాజకీయం ప్రవేశించడం మంచి పరిణామాలు కాదు అని ఆయన అన్నారు. వీసీలను రాజీనామా చేయమని డిమాండ్ చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు.
వీసీలను గవర్నర్ నియమిస్తారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం మారినా వీసీలు రాజీనామా చేరరని వారి పదవీకాలం ముగిసిన మీదటనే కొత్త వారికి అవకాశం ఇస్తారని ఇది సంప్రదాయం అని ఆయన అన్నారు. వైసీపీ కార్యాలయాలలోకి రావడానికి టీడీపీ నాయకులకు ఏమి పని అని ఆయన నిలదీశారు. ప్రైవెట్ ఆస్తులలోకి వారు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు.
తన మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద స్పందించాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు ఫైల్స్ అన్నీ విద్యా శాఖలోనే ఉన్నాయని ప్రభుత్వం ఎపుడైనా పరిశీలించుకోవచ్చునని ఆయన సూచించారు. ఓటమి తరువాత బొత్స మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఆయన గత నెల రోజుల టీడీపీ పాలన మీద మొదటిసారి రియాక్ట్ అయ్యారు.