ఒకాయన అప్పుడే ప్రమాద ఘంటికలు మోగించాడు

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎన్నో పార్టీలు భాగస్వాములుగా ఉన్నా ప్రధానంగా ఆ ప్రభుత్వాన్ని మోస్తున్నది రెండు పార్టీలే అని చెప్పొచ్చు. ఒకటి బీహార్లోని జేడీయూ పార్టీ, రెండోది ఏపీలో టీడీపీ. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో…

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎన్నో పార్టీలు భాగస్వాములుగా ఉన్నా ప్రధానంగా ఆ ప్రభుత్వాన్ని మోస్తున్నది రెండు పార్టీలే అని చెప్పొచ్చు. ఒకటి బీహార్లోని జేడీయూ పార్టీ, రెండోది ఏపీలో టీడీపీ. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అత్యధిక స్థానాలు సాధించడంతో మోడీ ప్రభుత్వం ఈ రెండు పార్టీల ఊతంతోనే నిలబడాలి.

ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కటి కూటమిలోనుంచి వెళ్ళిపోయినా మోడీ గవర్నమెంటు మైనారిటీలో పడిపోతుంది. ఈ సంగతి చంద్రబాబు నాయుడికి అండ్ నితీష్ కుమార్ కు బాగా తెలుసు. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం.

వీళ్ళు ఎప్పుడైనా తన కొంప ముంచుతారని మోడీకి కూడా తెలుసు. మోడీ సర్కారు ఏర్పడి ఇంకా నెల రోజులు కాలేదు. ఇంకా పూర్తిగా కుదుటపడనేలేదు. అప్పుడే నితీష్ తన అస్త్రాన్ని బయటకు తీసి ప్రమాద ఘంటికలు మోగించాడు. బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు పార్టీ తీర్మానం ఆమోదించింది.

నిజానికి ఇది పాత డిమాండే. ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ఎప్పుడో వాగ్దానం చేశారు. కానీ కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తన అవసరం మోడీకి ఉంది కాబట్టి డిమాండును మళ్ళీ ముందుకు తెచ్చాడు.

ఒకవేళ మోడీ కుదరదు అంటే నా దారి నేను చూసుకుంటా అనే అవకాశం ఉంది. ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడం… మళ్ళీ కలవడం నితీష్ కుమార్ కు అలవాటే. ఇండియా కూటమిలో ఉన్న నితీష్ దానికి జెల్ల కొట్టి ఎన్డీయేలో చేరాడు. ఇప్పుడు ఏదైనా తేడా వస్తే మోడీని ముంచి వెళ్ళిపోతాడు. ఏమీ మొహమాటం లేదు.

నితీష్ డిమాండ్ మోడీకి ప్రమాద ఘంటికలు మోగించడం ఏమోగానీ చంద్రబాబుకు ముందు నుయ్యి …వెనుక గొయ్యిలా తయారైందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇప్పుడు బాబు మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గెలవగానే కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని జగన్ అన్నాడు.

2019 ఎన్నికలప్పుడు జగన్ తనకు అధికారం ఇస్తే, పాతికమంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నాడు. బాబు చేయలేని పని తాను చేస్తానన్నాడు. ఆ నినాదంతోనే అధికారం సాధించాడు. కానీ అప్పుడు కేంద్రంలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ రావడంతో మనం డిమాండ్ చేసే అవకాశం లేదని జగన్ గమ్మున ఉండిపోయాడు.

అయితే ఇప్పుడు బాబుకు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గెలిచాక ఇండియా కూటమిలో చేరాలని కాంగ్రెస్ పార్టీ బాబును ఆహ్వానించింది. కానీ ఆయన ఎన్డీఏలోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు నితీష్ హోదా కోసం డిమాండ్ చేసేవరకల్లా బాబు మీద ఒత్తిడి పడుతోంది.

బాబు గమ్మున ఉంటే మాత్రం జగన్ కు ప్రజల్లోకి వెళ్ళడానికి మంచి అవకాశం. ఏపీలో కూటమి గెలిచాక హోదా కోసం డిమాండ్ చేయాలని జగన్ అంటే పదేళ్ల తరువాత ఇప్పుడు దానికి విలువ ఏముంటుందని టీడీపీ అనుకూల మీడియా రాసింది. మరి బాబు హోదా డిమాండ్ చేస్తాడా ? ఇతరత్రా ప్రయోజనాలు సాధించి ఏపీని డెవెలప్ చేయాలని అనుకుంటాడా?