ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ మారిపోయాడు

ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ రాజ‌నీతి కోవిదుడు. బాబుని పొగ‌డ‌డం, జ‌గ‌న్‌ని తిట్ట‌డం ఆయ‌న రాజ‌నీతి. అయితే జ‌గ‌న్ ఓడిపోవ‌డంతో ఆర్కే ల‌క్ష్యం నెర‌వేరింది. అందుక‌ని కొంచెం స్టైల్ మార్చాడు. బాబుకి హిత వాక్యాలు, హెచ్చ‌రిక‌లు మొద‌ల‌య్యాయి.…

ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ రాజ‌నీతి కోవిదుడు. బాబుని పొగ‌డ‌డం, జ‌గ‌న్‌ని తిట్ట‌డం ఆయ‌న రాజ‌నీతి. అయితే జ‌గ‌న్ ఓడిపోవ‌డంతో ఆర్కే ల‌క్ష్యం నెర‌వేరింది. అందుక‌ని కొంచెం స్టైల్ మార్చాడు. బాబుకి హిత వాక్యాలు, హెచ్చ‌రిక‌లు మొద‌ల‌య్యాయి. దీనికి కార‌ణం ఆయ‌న ముద్దుగా కూలి మీడియా అని పిలిచే సోష‌ల్ మీడియా ప్ర‌భావం కూడా కావ‌చ్చు.

ఇంత‌కు ముందు బాబు ఏం చేసినా గారాభంగా చూసేవాడు, రాసేవాడు. గ‌తంలో జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ని బాబు చీల్చిన‌పుడు కూడా, కుట్ర‌గా కాకుండా ఆర్కే దాన్ని వ్యూహంగానూ, జ‌గ‌న్‌కి త‌గిన శాస్తిగానూ అభివ‌ర్ణించాడు. అలివిమాలిన వాగ్దానాల‌తో చంద్ర‌బాబు నెత్తికి తెచ్చుకుంటాడ‌ని ఆంధ్ర‌జ్యోతికి తెలుసు. జ‌గ‌న్‌ని అయితే తాటిచెక్క‌తో బాదొచ్చు, కానీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర సున్నితంగా త‌మ‌ల‌పాకుతో కొట్టాలి.

ఈ ఆదివారం (జూన్ 30) కొత్త ప‌లుకుని ఒక‌సారి ప‌రిశీలిద్దాం. ఓడిపోయిన జ‌గ‌న్ బెంగ‌ళూరు ప్యాలెస్‌లో సేద‌తీరుతున్నాడ‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబుకి సొంత ఇల్లు లేదు, క‌నీసం ఇన్నిసార్లు గెలిచిన కుప్పంలో ఎపుడూ వుండ‌డు. ఈ మాట బాబుని ఆర్కే ఎప్పుడూ అడగ‌లేదు.

ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే పోల‌వ‌రం శ్వేత ప‌త్రంపైన బాబుకి వాత‌లు పెట్టారు. పోల‌వ‌రంని జ‌గ‌న్ మూల‌న పెట్టాడ‌ని ప్ర‌జ‌ల‌కి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌రిగింది చెప్ప‌కుండా జ‌ర‌గ‌బోయేది చెప్ప‌మ‌ని సూచించారు.

ఆర్కే రాయాల్సింది ఏమంటే వ‌చ్చి మూడు వారాలు కాలేదు. మూడుసార్లు అప్పుల కోసం వెళ్లారు. మ‌రి మీకు, జ‌గ‌న్‌కి ఏంటి తేడా అని అడ‌గాలి. శ్వేత‌ప‌త్రం ప్ర‌క‌టించాల్సింది పోల‌వ‌ర‌మో, అమ‌రావ‌తి మీదో కాదు. అవి ప‌ట్టించుకోలేద‌ని జ‌నం ఎలాగూ జ‌గ‌న్‌ని ఓడించారు.

చంద్ర‌బాబు ప‌థ‌కాల మీద ఇపుడు జ‌నం శ్వేత‌ప‌త్రాన్ని కోరుతున్నారు. పింఛ‌న్లు ఎలాగూ ఇస్తున్నారు, దాని సంగ‌తి వ‌దిలేస్తే మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణం, పిల్ల‌ల‌కు రూ.15 వేలు, 18 ఏళ్లు దాటిన వారికి నెల‌కు రూ.1500, రైతుల‌కు సాయం, ఉచిత సిలిండ‌ర్లు ఇవ‌న్నీ ఎపుడిస్తారు?  నిధులు ఎలా తెస్తారు?  సంవ‌త్స‌రానికి ల‌క్ష‌న్న‌ర కోట్ల ఆదాయ వ‌న‌రులు ఎక్క‌డున్నాయి?  సంప‌ద సృష్టించే విధానం ఏమిటి?  ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి బాబు నుంచి జ‌నం స‌మాధానాలు కోరుతున్నారు.  జ‌గ‌న్ చేసిన త‌ప్పుల మీద శ్వేత ప‌త్రం ఎవ‌రికి అవ‌స‌రం?

ఏళ్ల త‌ర‌బ‌డి చంద్ర‌బాబు వైఫ‌ల్యాల గురించి ఉప‌న్యాసాలు ఇస్తూ జ‌గ‌న్ మునిగిపోయాడు. ఇపుడు చంద్ర‌బాబు అదే బాట‌లో వెళుతున్నాడ‌ని ఆర్కే గ్ర‌హించారు. అనుభ‌వం మీద ఆయ‌న‌కి కూడా త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. చంద్ర‌బాబు గ‌తాన్ని మ‌రిచి వెనుక‌టిలాగే వుంటే జ‌నం మ‌ళ్లీ కొర‌డా తీసుకుంటారు.

సాక్షికి ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల పేరుతో ప్ర‌భుత్వ ధ‌నాన్ని వృథా చేస్తున్నార‌ని గ‌గ్గోలు పెట్టిన చంద్ర‌బాబు, రామోజీ స‌భ‌కి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్ట‌డాన్ని కూడా ఆర్కే ఆక్షేపించారు. రూల్ ప్ర‌కార‌మైతే ఇక్క‌డ కూడా వెన‌కేసుకు రావాలి. లేదంటే ఆంధ్ర‌జ్యోతి భ‌జ‌న గురించి కాకుండా జ‌నం గురించి ఆలోచిస్తూ వుంద‌ని అర్థం. మ‌రక మంచిదైన‌ట్టు మార్పు కూడా మంచిదే.