పులివెందుల మునిసిపాలిటీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక అభివృద్ధి పనులు జరిగాయి. పాడా అనే సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి పనులు చేయించారు. కాకపోతే.. వారిలో కొందరికి కొంత మేరకు బిల్లులు ఇంకా మంజూరు కాలేదు. ఇప్పుడు రాజకీయ పరిణామాలను గమనిస్తోంటే.. ఆ బిల్లులు మంజూరు కావాలంటే.. వైసీపీని వీడి తమ పార్టీలో చేరాలని తెలుగుదేశం పార్టీ వారందరికీ ఎర వేస్తున్నట్టుగా, బెదిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పులివెందులలోని వైసీపీ ఎమ్మెల్యే అసమ్మతి గళం వినిపిస్తుండడమే ఇందుకు కారణం.
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. అయిదు రోజుల పాటు అక్కడే ఉండి.. ప్రజలతో మమేకం కావాలని ఆయన అనుకున్నారు. కానీ ఆయన పర్యటన రెండున్నర రోజులకే ముగిసింది. అక్కడ పనులు చేసిన కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు జగన్ ను తమ బిల్లులు సంగతి ఏంటని ఒత్తిడి చేసినట్టుగా, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన బెంగుళూరు వెళ్లిపోయినట్టుగా పచ్చ మీడియాలో వార్తలొచ్చాయి. కోర్టుకు వెళ్లియనా సరే బిల్లులు తెచ్చుకుందాం అని జగన్ వారికి భరోసా ఇచ్చినట్టుగా సాక్షి మీడియా రాసింది.
మొత్తానికి కాంట్రాక్టు పనులు చేసిన కౌన్సిలర్లు ఇబ్బంది పడుతున్నట్టుగా తేలింది. ఇప్పుడు ఆ కౌన్సిలర్లతో ఎంపీ అవినాశ్ రెడ్డి సమావేశం నిర్వహించి.. భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం. ఆయనకూడా.. ప్రభుత్వం బిల్లులు ఇచ్చేదాకా వేచిచూద్దాం అని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి బిల్లులు తెచ్చుకుందాం అని అవినాష్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
నిజం చెప్పాలంటే కోర్టుకు వెళ్లినంత మాత్రాన బిల్లులు వస్తాయనే గ్యారంటీ లేదు. తెలుగుదేశం హాయంలో పనులు చేసిన వారికి, జగన్ వచ్చాక బిల్లులు చెల్లించలేదు. చిన్న కాంట్రాక్టులు చేసిన వారు వందల సంఖ్యలో ఇంకా కోర్టుల్లో కేసులు నడుపుతున్నారు.
అయితే ఇక్కడ మరో కీలకాంశం ఏంటంటే.. పులివెందుల మునిసిపాలిటీలోని కౌన్సిలర్లకు బిల్లులు చెల్లించాలంటే.. వైసీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలని తెలుగుదేశం పెద్దలు ఎరవేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు వీలైనంత మందిని బిల్లుల పేరిట ప్రలోభపెట్టి.. తమ పార్టీలో చేర్చుకుని పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారట.
గతంలో ఎన్నికలు జరిగినప్పుడు.. కుప్పం మునిసిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు దొంగదారిలో పులివెందుల మునిసిపాలిటీని తెలుగుదేశం వశం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.