వైసీపీ మాజీ ఎంపీ టార్గెట్

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అధికార కూటమి ప్రభుత్వానికి బాగా టార్గెట్ అయ్యారని అంటున్నారు. ఆయన బిల్డర్ కూడా. ప్రస్తుతం ఆయన సంస్థ ఆద్వర్యంలో ఇరవై దాకా ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి.…

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అధికార కూటమి ప్రభుత్వానికి బాగా టార్గెట్ అయ్యారని అంటున్నారు. ఆయన బిల్డర్ కూడా. ప్రస్తుతం ఆయన సంస్థ ఆద్వర్యంలో ఇరవై దాకా ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అవి పూర్తి కావాల్సి ఉంది.

అధికారంలోకి కొత్త ప్రభుత్వం రావడంతో మాజీ ఎంపీకి చిక్కులు మొదలయ్యాయి. ఆయన మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు. నాన్ బెయిల్ బుల్ వారెంట్ తో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ ఎంపీ అధికార పార్టీకి రాయబారాలు పంపుతున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.

కూటమిలోని ఒక ఎంపీని ఆయన కలిశారని తనకు ఉపశమనం కలిగే విధంగా చూడాలని కోరారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సదరు ఎంపీ మొదట్లో అనుకూలంగా చేయాలనుకున్నా కూటమి పెద్దల నుంచి జోక్యం చేసుకోవద్దు అని సందేశం రావడంతో సైలెంట్ అయ్యారని టాక్.

అలాగే గతంలో విశాఖ జిల్లాలో మంత్రిగా పనిచేసి టీడీపీలో చక్రం తిప్పిన ఒక బడా నేత కూడా ఆయన విషయంలో ఉత్సాహం చూపించారని ఆయనను ఒడ్డున పడేస్తే ఉభయకుశలోపరిగా అంతా ఉంటుందని లెక్క వేసుకుని మరీ ముందుకు వచ్చారని ప్రచారం సాగింది.

అయితే ఆయనకు ఇటీవల టీడీపీలో పలుకుబడి తగ్గిందని అంటున్నారు. పైగా ఆయన ద్వారా వచ్చిన ఈ రాయబారాలను కూడా కూటమి పెద్ద‌లు తిరస్కరించారని అంటున్నారు. మాజీ ఎంపీ నిర్మాణాల మీద గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు వాటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. 

దాంతో జనసేన సైతం ఆయన మీద గుర్రుగా ఉందని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే కూటమి పెద్దలకు ఈ మాజీ ఎంపీ బాగా టార్గెట్ అయ్యారని అంటున్నారు. ఆయన ఏ విధంగా తప్పించుకుంటారు ఉపశమనం పొందుతారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. అయితే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అందువల్ల కూటమి ప్రభుత్వ హానీమూన్ హడావుడి ముగిశాక ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు.