రాష్ట్ర శాసనసభాపతిగా నియమితులైన తరువాత తొలిసారి తన ఉమ్మడి విశాఖ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన నర్శీపట్నానికి వచ్చిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఘనస్వాగతం లభించింది. ఆయనకు పౌర సత్కారం కూడా లభించింది.
స్పీకర్ గా తనకు ఈ పదవి దక్కడం ఆనందదాయకం అని అయ్యన్న మీడియాకు చెప్పారు. తనకు చిన్న వయసులో మంత్రి పదవి లభిస్తే పెద్ద వయసులో తన అనుభవానికి తగిన స్థానంగా స్పీకర్ పదవి లభించిందని అయ్యన్న పేర్కొన్నారు. తాను సభా సంప్రదాయాలను ఇనుమడింప చేసే విధంగా వ్యవహరిస్తారు అని ఆయన చెప్పడం విశేషం. తాను తన పరిధికి లోబడి హుందాగా వ్యవహరిస్తాను అని ఆయన తెలిపారు.
రాష్ట్ర సమస్యలను సరైన వేదికగా అసెంబ్లీలో చర్చ జరిగేలా చూస్తామని అన్నారు. అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చకు పెద్దపీట వేస్తామని అన్నారు. తనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని ఆయన చెప్పారు. ప్రతిపక్ష హోదా కోసం ఆయన రాసిన లేఖగా పేర్కొన్నారు. అయితే దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయ్యన్న చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్ట ప్రకారమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా పైన చట్టంలో ఏమి ఉంది అన్నది ఇపుడు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. చట్ట ప్రకారం అంటే పదో వంతు సభ్యులు ఉండాలా అన్నది కూడా చూస్తున్నారు. అయితే 1953 అసెంబ్లీ యాక్ట్ ప్రకారం చూస్తే ఆ ప్రస్తావనే లేదని నిపుణులు అంటున్నారు. మరి అయ్యన్న జగన్ లేఖ మీద ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్న చర్చకు తెర లేచింది.