టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు పల్లా శ్రీనివాసరావు శుభవార్త చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్ళలో పోరాటాలు చేసి రాజకీయ కక్ష సాధింపుల రూపంలో కేసులు ఎదుర్కొంటున్న వారందరికీ ఉపశమనం కలిగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రానున్న మూడు నెలల వ్యవధిలోనే తమ్ముళ్ళు అందరి మీద పెట్టిన కేసులను తొలగించేలా ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తల మీద పెట్టిన కేసులు అన్నీ అక్రమ కేసులుగా ఆయన పేర్కొన్నారు. చాలా కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని వాటి విషయంలో కూడా తగిన విధంగా వ్యవహరించి ఏడాదిలోగా ఆ కేసులను తొలగించే ప్రయత్నం చేస్తామని పల్లా అంటున్నారు.
గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని అయినా తట్టుకుని పోరాడాని పల్లా క్యాడర్ ని కొనియాడారు. మెరికల్లాంటి క్యాడర్ ని ఎంపిక చేసి నామినేటెడ్ పదవులు వారికి దక్కేలా చూస్తామని అన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తూ ఏ పదవులకూ నోచుకోని వారికి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అలాగే రాయలసీమను కూడా అగ్ర భాగాన నిలిపేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుందని పల్లా అన్నారు. యువతను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు ఉత్సాహంగానే ఉన్నారు. తన పదవికి తగిన న్యాయం చేస్తామని ఆయన చెబుతున్నారు. క్యాడర్ కోసం పార్టీ తలుపులు ఎపుడూ తెరచే ఉంటాయని పల్లా అంటున్నారు.