తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉందా అంటే ఉండకుండా ఎందుకు ఉంటుంది అన్న జవాబు వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా అందరికీ న్యాయం చేయలేదు. అలాంటప్పుడు న్యాయం తమకు దక్కలేదని భావించేవారు అసంతృప్తికే లోను అవుతారు. కొందరు బయటపడతారు, మరికొందరు లోలోపల అలా దాచుకుని మధన పడతారు.
అలా చూస్తే కనుక ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తిలో ఉన్నారా అన్న చర్చకు తెర లేచింది. ఆయన ఎవరో కాదు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు.ఈసారి మంచి మెజారిటీతో గెలిచారు.
ఆయన బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈసారి తనకు తప్పకుండా మంత్రివర్గంలో చాన్స్ దక్కుతుందని ఆశపడ్డారు. జిల్లాలో సమీకరణలు చూసినా అనుకూలంగా ఉన్నాయని భావించారని అంటున్నారు. కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అవకాశం దక్కింది కాబట్టి బాబాయ్ అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వరని అనుకున్నారు.
అలాగే శ్రీకాకుళం జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలలో ఒకటిగా ఉన్న కాళింగులకు చాలా ఏళ్లుగా మంత్రివర్గంలో చాన్స్ దక్కడం లేదు. చివరిసారిగా మంత్రి అయినది పాతికేళ్ల క్రితం తమ్మినేని సీతారాం మాత్రమే. దాంతో ఈసారి తమకు పదవి ఖాయమని ఆ సామాజిక వర్గం అంతా భావించింది.
కానీ అచ్చెన్నకు మంత్రి పదవి ఇచ్చి అంతటితో సరి పెట్టేశారు. ఈ పరిణామాల మీద కాళింగులు మండిపడుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ఆ సామాజిక వర్గం నేతలు తమ కులానికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపధ్యంలో కూన రవికుమార్ తనకు ప్రభుత్వం రక్షణగా కేటాయించిన గన్ మెన్లను వద్దు అని తిప్పి పంపించేయడం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది.
తనకు ఎలాంటి భయాలు లేవని ప్రతిపక్షంలో ఉన్నపుడే బాగా పనిచేశాను అని ఇపుడు తనకు వేరేగా రక్షణ ఎందుకు అని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. అయితే ప్రభుత్వం సమకూర్చిన గన్ మెన్లను వెనక్కి పంపించేయడం ద్వారా కూన రవికుమార్ అసంతృప్తిని చెప్పకనే చెప్పారని అంటున్నారు.
ఆయన మాదిరిగానే చాలా మంది సీనియర్లు లోలోపల ఇబ్బంది పడుతున్నారు. అయితే కూన ఈ విధంగా చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. మంత్రి పదవి ఎటూ రాదు ప్రభుత్వ విప్ అయినా ఆయనకు ఇస్తారా అలాంటి పదవి కోసమేనా ఆయన ఈ విధంగా చేస్తున్నారా అన్నది కూడా తమ్ముళ్ళు తర్కించుకుంటున్నారు.