చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నిరసన వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ అధికారంలో వుండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించి వేధించారని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎక్కడుందని గతంలో ప్రశ్నించిన యాదయ్య… ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా వచ్చారనేది కార్యకర్తల ప్రశ్న. గో బ్యాక్ యాదయ్య అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినదిస్తున్నారు.
కాంగ్రెస్‌లో యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా మండల కేంద్రమైన నవాబుపేట్‌లో అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరాహార దీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది. యాదయ్య చేరికతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోయారు. కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నించిన యాదయ్య, ఇప్పుడా పార్టీలో చేరడం హాస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పీడ్ పెంచారు. తన ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ హెచ్చరించడం వల్లే, ఫిరాయింపులకు తెరలేపామని రేవంత్‌రెడ్డి చెప్పడం గమనార్హం. ఇప్పటికే ఐదారుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని మరోవైపు బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. అందుకే ప్రశ్నించే నైతిక హక్కును బీఆర్ఎస్ కోల్పోయింది.