సాయంత్రం అయ్యేసరికి అలసట ఆవహిస్తోందా? ఏ ఒత్తిడి లేకుండానే తలనొప్పి వస్తోందా? వారానికి ఒకసారైనా కండరాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇది మీరు వాడే సెంట్ వల్ల వచ్చే దుష్పరిణామం కూడా కావొచ్చు. అతిగా పెర్ ఫ్యూమ్ వాడడం వల్ల ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
సాధారణంగా సెంట్ ఎక్కువగా వాడే వాళ్లకు చర్మ సంబంధ సమస్యలు వస్తుంటాయి. అయితే ఈమధ్య కాలంలో సెంట్ తయారీలో వాడతున్న రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. అందులో భాగంగానే మానసిక ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
మంచి వాసన వస్తోందని అతిగా పెర్ ఫ్యూమ్స్ వాడితే చర్మవ్యాధులతో పాటు… ముక్కు-కళ్లు-గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. వీటితో పాటు సెంట్ లో ఉండే కెమికల్స్.. పురుషుడి లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని సర్వేలో వెల్లడైంది.
వీలైనంత తక్కువగా పెర్ ఫ్యూమ్ వాడడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే తక్కువ మోతాదులో వాడాలి. ముఖానికి దగ్గరగా సెంట్ ను కొట్టుకోకూడదు. సెంట్ బాటిల్ ను నేరుగా చర్మానికి రుద్దడం చేయకూడదు. చాలా దగ్గర్నుంచి సెంట్ ను శరీరంపై స్ప్రే చేయకూడదు.
మంచి బ్రాండ్స్ కు చెందిన పెర్ ఫ్యూమ్స్ లో ఎంత దూరం నుంచి స్ప్రే చేయాలో కూడా చెబుతారు. ఇక పొగ/ఆవిరి రూపంలో బయటకొచ్చే సెంట్స్ కంటే.. కాస్త చెమ్మగా, ఆయిల్ బేస్డ్ గా ఉండే పెర్ ఫ్యూమ్స్ వాడితే మంచిదని చెబుతున్నారు. వీటి వల్ల రసాయనాలు ఎక్కువగా శరీరంలోకి చొచ్చుకొని పోకుండా ఉంటాయట.