ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అసంతృప్తి. అసంతృప్తి అనేది మనసులో ఉన్నంత వరకూ ప్రమాదం లేదు. దాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటే మాత్రం ఎదుటి వాళ్లకు తప్పక డ్యామేజీ కలుగుతుంది. తాజాగా ఏపీ సర్కార్‌పై ఇద్దరు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారులను వ్యూహాత్మకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయోగిస్తోంది. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఎల్లో మీడియా వేదిక కావడంతో, వారి వెనుక ఎవరున్నారో, ఏ పార్టీ ప్రయోజనాలు దాగి ఉన్నాయో అర్థం చేసుకోవడం సులభమో.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఇదే వ్యూహం పన్ని సక్సెస్ అయ్యింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై రిటైర్డ్ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం వ్యూహాత్మకంగా విమర్శల దాడి చేశారు. ఒక వర్గం ప్రజల్లో వారి విమర్శలు ఎంతోకొంత పని చేశాయనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు అదే అస్త్రాన్ని టీడీపీ కూడా ప్రయోగిస్తోంది.
రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేశ్‌లను టీడీపీ ప్రయోగిస్తోందనే అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. ఇటీవల ఐఏఎస్ అధికారులకు హైకోర్టు సేవాశిక్ష విధించడంపై కూడా ఎల్వీ సుబ్రమణ్యం తనదైన కోణంలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఏపీ ఆర్థిక సంక్షోభంపై ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేశ్ తీవ్ర విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తటస్థులు, మేధావులు, విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు వీళ్ల అభిప్రాయాలు పనికొస్తాయని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భావిస్తోంది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఎల్వీ సుబ్రమణ్యాన్ని చీఫ్ సెక్రటరీగా కొనసాగించారు. అలాగే పీవీ రమేశ్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. జగన్‌కు ఎంతో సన్నిహితులైన ఈ ఇద్దరు ఉన్నతాధికారులతో జగన్‌కు ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ, వారు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్‌గా తప్పించి బాపట్లకు అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. కనీసం ఆ పోస్టులో చేరకుండానే ఎల్వీ తీవ్ర అసంతృప్తిలో రిటైర్డ్ కావడం గమనార్హం. పీవీ రమేశ్‌ను కూడా దగ్గరికి తీసుకున్నట్టే అనిపించినా, ఆయన కూడా అసంతృప్తితో వైదొలిగారు. ఇప్పుడు ఆ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవాళ పీవీ రమేశ్ దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తన మార్క్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరి సలహాలు వినకపోవడం వల్లే ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉచిత పథకాలపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ ఖర్చులు తగ్గించుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఒకవైపు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఉచితంగా పంచి పెట్టేస్తున్నారని, మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదని ఆరోపించారు. కరెంట్, నీళ్లు, రోడ్ల సౌకర్యాలు లేవని, ఈ తమాషా ఇంకెన్నాళ్లని పీవీ రమేశ్ ప్రశ్నించడం ప్రతి ఒక్కరిలో ఓ ఆలోచనను చిగురింపజేయక మానదు.
జగన్ మరో బాధిత సినియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఇటీవల కాలంలో వరుస విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభ అంచుల్లో ఉందని పెద్ద బండే వేశారాయన. ఏపీ ప్రభుత్వ ఖాతాలను రిజర్వ్ బ్యాంక్ స్తంభింపజేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని ఏవో రెండు మూడు కార్యక్రమాలు అమలు చేస్తూ, మిగిలిన వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తేనే రాష్ట్రానికి మనుగడ ఉంటుందని ఆయన హెచ్చరిక చేయడం విశేషం.
ఇద్దరు ఐఏఎస్ అధికారులు చెప్పేది ఏంటంటే… అయ్యా వైఎస్ జగన్ గారు సంక్షేమ పథకాలను వెంటనే నిలుపుదల చేస్తే తప్ప మనకు మనుగడ ఉండదని. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు నిబంధనలు విధిస్తే, చూశారా జగన్ పథకాల్లో కోత విధించడానికే ఈ కుట్రలని ప్రతిపక్షాల విమర్శలు. సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలు భయపడుతున్నాయనేది ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేయలేని అంశాల్ని , ఇలా మేధావులు, సీనియర్ అధికారులతో చెప్పించడం ఎల్లో బ్యాచ్ కుట్రగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.