ఈ ప్రేమలేఖలేంటి గంటా…?

ఉద్యమం అంటే అగ్గిలోకి దూకేయడమే. ఆకాంక్ష సాధన  కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడమే. తన పర తేడా లేకుండా అందరినీ కలుపుకుని పోవడమే. ఆశయం మంచిదైనపుడు, నిప్పులా అదే ప్రజ్వరిల్లుతుంది. అపుడు పెద్దలు ఎవరైనా…

ఉద్యమం అంటే అగ్గిలోకి దూకేయడమే. ఆకాంక్ష సాధన  కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడమే. తన పర తేడా లేకుండా అందరినీ కలుపుకుని పోవడమే. ఆశయం మంచిదైనపుడు, నిప్పులా అదే ప్రజ్వరిల్లుతుంది. అపుడు పెద్దలు ఎవరైనా దిగి వస్తారు. లక్ష్యం కూడా నెరవేరుతుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు లాంటి వారు ఇదే చేశారు. అమరణ దీక్షకు కూర్చున్నారు. ముఖ్యమంత్రి నోటి మాటను కూడా నమ్మకుండా కేంద్రం ప్రకటన చేసేంతవరకూ దీక్ష కొనసాగించారు. ఏనాడో ఈ భువిని వీడి దివికేగిన అమృతరావు, విశాఖ ముద్దు బిడ్డ తెన్నేటి విశ్వనాధం లనటి వారు తమ త్యాగాలతో వచ్చిన విశాఖ స్టీలు ప్లాంట్ ఉక్కులా చెక్కుచెదరనే నమ్మి తనువులు విడిచారు.

మళ్ళీ ఉక్కు కోసం పోరాటం చేయాల్సివస్తుందని వారు ఊహించి ఉండరు. కానీ ఇపుడు కాని కాలం వచ్చింది. పప్పూ బెల్లాల మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టేస్తున్నారు. అందులో భాగంగా నవరత్నాల్లో ఒకటిగా ఉన్న విశాఖ ఉక్కుని నూరు శాతం ప్రైవేటీకరించి చేతులు దులుపుకుంటామని కేంద్రం ప్రకటించేసింది.

ఇపుడు చేయాల్సింది ఏంటి అంటే ఉద్యమ బాట పట్టడమే. మరి విశాఖ ఉక్కు కోసం తాను పోరాడుతాను అంటూ తొట్టతొలిగా స్పందించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ దిశగా ఇంకా అడుగులు వేయడంలేదని ప్రత్యర్ధులు అంటున్నారు.

ఆయన ఎంతసేపూ ముఖ్యమంత్రికి లేఖలు రాయడంతోనే పొద్దుపుచ్చుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పని అవి చేస్తాయి. విశాఖ ఉక్కు కోసం తానున్నాను అని ముందుకు వచ్చిన మాజీ మంత్రి ఈ ప్రేమ లేఖలు రాయడం మానేసి ఉద్యమించాలని ఉక్కు కార్మికుల నుంచి వస్తున్న విన్నపం.  మరి గంటా దీక్ష చేస్తారా ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా భారీ ఉద్యమాలు చేస్తారా అని ఉక్కు కార్మిల లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తెలంగాణలో పార్టీ వద్దన్నదే జగన్ భావన