సినిమాల్లో పబ్ సాంగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఐటెం భామ అందాలు, డీజే హోరు, కిక్కెక్కించే స్టెప్పులు, కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతులు.. ఆ హుషారే వేరు. ఆ హంగామా మరో లెవెల్. బ్రో సినిమా పబ్ సాంగ్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటికి అదనంగా మరో ఆకర్షణ కూడా వచ్చి చేరింది.
కొద్ది సేపటి కిందట బ్రో సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. పైన చెప్పుకున్న ఎలిమెంట్స్ తో పాటు, సాహిత్యంలో ఓ మంచి సందేశాన్నిచ్చారు. ప్రతి రోజూ ఓ పండగలా ఎలా జీవించాలో చెప్పారు. ఓ పబ్ సాంగ్ లో ఇలా జీవిత సత్యాల్ని చెప్పడం కొత్తగా ఉంది, మెచ్చుకోదగ్గ ప్రయత్నమే.
కమాన్ కమాన్ డాన్స్ బ్రో అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. రేవంత్-సిగ్న ఆలపించారు. ఊర్వశి రౌతేలా ఈ సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్ సంగీత దర్శకుడు.
బ్రో సినిమా కోసం భారీ పబ్ సెట్ వేశారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తూనే ఉంది. ఆ పబ్ సెట్ ఎలా ఉండబోతోందో ఈరోజు రిలీజైన లిరికల్ వీడియోలో కొంచెం హింట్ ఇచ్చారు. చాలా కలర్ ఫుల్ గా ఉంది ఈ సెట్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు. సాయితేజ్ అతడ్ని సినిమాలో 'బ్రో' అని పిలుస్తాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈనెల 28న థియేటర్లలోకి వస్తోంది బ్రో.