యాక్షన్ లో దిగిన సుదీప్.. నిర్మాతపై పరువునష్టం కేసు

కన్నడ నటుడు సుదీప్ పై కొన్ని రోజులుగా రెమ్యూనరేషన్ కు సంబంధించిన వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్ఎన్ కుమార్, ఎమ్ఎన్ సురేష్ అనే ఇద్దరు నిర్మాతలు సుదీప్ పై ఆరోపణలు చేస్తున్నారు. సినిమా…

కన్నడ నటుడు సుదీప్ పై కొన్ని రోజులుగా రెమ్యూనరేషన్ కు సంబంధించిన వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్ఎన్ కుమార్, ఎమ్ఎన్ సురేష్ అనే ఇద్దరు నిర్మాతలు సుదీప్ పై ఆరోపణలు చేస్తున్నారు. సినిమా చేస్తానని మాటిచ్చి, తమ వద్ద నుంచి 8 ఏళ్ల కిందట 9 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారనేది వీళ్ల ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా, మధ్యలో తన ఇంట్లో కిచెన్ రిపేర్ కోసం మరో 10 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారని వీళ్లు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఈ ఇద్దరు నిర్మాతలు, తాజాగా నిర్మాతల మండలిని కూడా ఆశ్రయించారు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి సుదీప్ తప్పించుకుంటున్నారని, కాల్షీట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాళ్లు ఫిర్యాదు చేశారు. తమ అడ్వాన్స్ డబ్బును తమకు వెనక్కి ఇప్పించాల్సిందిగా వాళ్లు కోరారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్నాడు సుదీప్. అప్పుడప్పుడు పరోక్షంగా మాత్రమే ట్వీట్లు వేస్తూ వచ్చాడు. అయితే ఈసారి నేరుగా యాక్షన్ లోకి దిగాడు. తనపై ఆరోపణలు చేస్తున్న ఇద్దరు నిర్మాతలకు పరువు నష్టం నోటీసులిచ్చాడు ఈ హీరో.

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సుదీప్ ప్రతిష్టకు భంగం కలిగేలా నిర్మాతలు వ్యవహరించారని, సరైన ఆధారాలు చూపించకుండా, తప్పులు ఆరోపణలు చేసి సుదీప్ ను, అతడి కుటుంబ సభ్యుల్ని మానసిక క్షోభకు గురిచేశారని ఆ నోటీసులో ఆరోపించారు.

తక్షణం నిర్మాతలిద్దరూ నోటీసులకు స్పందించాలని, 3 రోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని, అంతేకాకుండా, పరువు నష్టం కింద 10 కోట్ల రూపాయల్ని చెల్లించాలని కూడా ఆ నోటీసులో సుదీప్ డిమాండ్ చేశాడు.

సుదీప్ నేరుగా రంగంలోకి దిగడంతో, ఈ వివాదం మరింత ముదిరినట్టయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హీరో-నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. అయితే నిర్మాతల మండలి మాత్రం, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెబుతోంది.