యాత్ర సినిమా చూశాం. అందులో వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానాన్ని అద్భుతంగా చూపించారు. మరి యాత్ర-2లో ఏం చేయబోతున్నారు? జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడ్నుంచి ప్రారంభించబోతున్నారు? వైఎస్ఆర్ ను మరోసారి చూపిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాడు దర్శకుడు మహి వి రాఘవ్.
“యాత్ర 2లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి గారి పీరియడ్‌ను చూపిస్తాను. ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. యథార్థ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.”
ఇలా యాత్ర-2పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. యాత్ర సినిమాతో యాత్ర-2కు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసిన మహి, ఈ సినిమాను కచ్చితంగా ఎన్నికల సీజన్ లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఓటర్లు సినిమాలకు ప్రభావితం కారని, అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారని అంటున్నాడు.
మరోవైపు జగన్ పాత్రను బేస్ చేసుకొని వ్యూహం అనే సినిమా తీస్తున్నాడు ఆర్జీవీ. ఆ సినిమాకు యాత్ర-2కు ఎలాంటి పోలిక, సంబంధం ఉండదని అంటున్నాడు మహి వి రాఘవ్. యాత్ర-2 జగన్ బయోపిక్ లా ఉండదని, కాస్త ఫిక్షన్ జోడించి, పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.