నాగశౌర్య వాస్తవం ఒప్పుకున్నాడు. రంగబలి సినిమాలో ఫస్టాఫ్ ను హిలేరియస్ గా చెప్పి, సెకండాఫ్ లో కథపై ఫోకస్ పెట్టేసరికి చాలామందికి నచ్చలేదనే విషయాన్ని అంగీకరించాడు. అలా అని సెకెండాఫ్ లో కూడా నవ్వించలేమని, తాము ఇండస్ట్రీలో ఉన్నది జోకులు చెప్పడానికి కాదని, మంచి కథ చెప్పడానికి వచ్చామని అన్నాడు.
“సెకండాఫ్ లో తప్పులేదు, ఫస్టాఫ్ లో మరీ కామెడీ డోస్ ఎక్కువైపోయింది. అదే తప్పు. సెకెండాఫ్ లో ఎక్కడా ల్యాగ్ లేదు. కంటెంట్ మాత్రమే చూపించాం. అది చాలామందికి నచ్చలేదు. కానీ మేం ఇక్కడున్నది నవ్వించడానికి కాదు. కంటెంట్ చెప్పాలనుకున్నాం. సెకెండాఫ్ లో అదే చెప్పాం. జనాలకు మంచి చెప్పడం కోసం మేం ఉన్నాం. ఇవన్నీ వద్దు అడల్ట్ కంటెంట్ కావాలి, పిచ్చి జోకులు మాత్రమే కావాలంటే మా దగ్గర బొచ్చెడు స్క్రిప్ట్స్ ఉన్నాయి.”
ఇలా కుండబద్దలుకొట్టేలా మాట్లాడాడు శౌర్య. సెకెండాఫ్ లో సత్య క్యారెక్టర్ లెంగ్త్ తగ్గడాన్ని సమర్థించుకున్నాడు శౌర్య. సత్య పాత్రను సెకండాఫ్ లో కూడా కొనసాగిస్తే, స్టోరీ కిల్ అయిపోతుందని, చెప్పాలనుకున్న పాయింట్ మిస్సవుతుందని అన్నాడు. ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉండడం వల్లే సెకెండాఫ్ పై జనాల్లో అసంతృప్తి కనిపించిందని, అంతేతప్ప సెకెండాఫ్ బ్యాడ్ కాదని అంటున్నాడు.
నాగశౌర్య ఎంతలా తన సినిమాను సమర్థించుకున్నప్పటికీ రంగబలి సినిమాపై మిక్స్ డ్ టాక్ మాత్రం ఆగలేదు. సినిమా ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ తర్వాత మూవీని లైట్ తీసుకోవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.