టీటీడీలో ఆధార్ అనుసంధానంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శనాలు, గదుల కేటాయింపు తదితర విషయాలకు సంబంధించి దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా దర్శన టికెట్ల జారీలో ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా దళారీలను అరికట్ట వచ్చన్నారు.
ఆన్లైన్లో ఒకే ఐడీ, మొబైల్ నంబర్ ద్వారా టికెట్లు పొందుతున్న 40 వేల ట్రాన్సాక్షన్లు రద్దు చేసినట్టు ఈవో వెల్లడించారు. అలాగే శ్రీవాణి దర్శన టికెట్లను 1500కు పరిమితం చేసినట్టు ఈవో తెలిపారు. ఈ టికెట్ల జారీకి శాశ్వతంగా ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈవో వెల్లడించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదిలా వుండగా శ్రీవాణి దర్శనం టికెట్లపై చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ దర్శనాలు కొనసాగించడంతో పాటు మరిన్ని ఎక్కువ ఇవ్వడం విశేషం. దీంతో రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రీవాణి టికెట్లపై విమర్శలు చేశారనే చర్చకు తెరలేచింది. శ్రీవాణి టికెట్లను రద్దు చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆ పరిస్థితి నేడు కనిపించడం లేదు.