షర్మిల ఆశ‌యాలు ప‌రిమ‌ళించాలి

వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం సాధించేందుకు  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు వెల్ల‌డైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ప్రభావం ఎలా…

వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం సాధించేందుకు  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు వెల్ల‌డైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. సుప్రసిద్ధ తత్వవేత్త రాజకీయాలు గురించి ఇలా విశ్లేషిస్తారు…

” ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించేదే రాజకీయాలు” . రాజకీయాలు అంటే ప్రజలకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం.

షర్మిల తెలంగాణాలో నూతన రాజకీయ పార్టీని స్థాపించడానికి నేటి నుంచి మేథోమ‌ధ‌నానికి సిద్ధమ‌య్యారు. పలు ఊహాగానాలు వినిపిస్తున్నా రాజకీయాలలో షర్మిల లాంటి ప్రభావిత వ్యక్తులు రావడం మంచిదే. ప్రజలు విరివిగా రాజకీయ ప్రక్రియలో పాలుపంచుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది. 

ఎక్కువ పార్టీలు ఉంటే ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అధికార పార్టీపై కోపం వస్తే యధాలాపంగా మాకు అధికారాన్ని ప్రజలు ఇస్తారు అన్న భరోసా ప్ర‌త్య‌ర్థి పార్టీలకు ఉంటే అది నియంతృత్వానికి దారి తీస్తుంది.

ప్రజల మన్ననలు పొందిన నేత షర్మిల

వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమార్తెగా జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించిన కొత్తలో వారు జైలులో ఉన్నప్పుడు షర్మిల చేసిన పాదయాత్ర ఆమెలోని రాజకీయ శక్తి సామర్ధ్యాలను సమాజం చూసింది. ఒక మహిళ సుదీర్ఘ పాదయాత్ర అసాధారణ విషయం.

ప్రతిపక్ష పార్టీల హేళనల‌కు ఎక్కడా వెరవకుండా అంతే దీటుగా ఎదుర్కొనేందుకు షర్మిల సిద్ధపడిన తీరు ప్రశంసనీయం. 2014 , 2019 సాధారణ ఎన్నికల ప్రచారంలో సూటిగా చెప్పదలుచుకున్నది కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పిన షర్మిల ప్రచారం ప్రజలను ఆకట్టుకున్నది. 

నిర్మొహమాట త‌త్వం , ప్రజలతో మమేకం అయిన తీరు వారిలో దివంగత వైఎస్‌ను జనం చూసుకున్నారు.2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రధాన అంశంగా ఉంది. రాష్ట్రం సాకారం అయిన తర్వాత నేడు త‌మ‌ జీవితాలలో వచ్చిన మార్పు ఏమిటి అన్న చర్చ తెలంగాణ స‌మాజంలో విస్తృతంగా జరుగుతోంది.

తెలంగాణపై వైఎస్‌ది చెరగని ముద్ర

షర్మిల రాజకీయ నినాదం తెలంగాణలో రాజన్న రాజ్యం. ఫీజు మాఫీ , ఆరోగ్య శ్రీ పథకాలు తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు హితోదికంగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా వైఎస్ అమలు చేసిన ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు చేసింది. 

గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు , శంషాబాద్ విమానాశ్రయం, రింగ్ రోడ్డు వైఎస్ కృషితో వచ్చినవే. అలా తెలంగాణ రాష్ట్రం మీద వైఎస్‌ ముద్ర ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకున్నా 2014 ఎన్నికల్లో ఒక ఎంపీ , ముగ్గురు ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం లో శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు కారణంగా వైఎస్ అభిమానులు టీఆర్ఎస్‌కు ఓటు వేశారు. దాని ఫలితం కాంగ్రెస్ పై తీవ్రంగా పడింది.

షర్మిలపై విమర్శలు అర్ధరహితం

షర్మిల పార్టీ ఆలోచన రాగానే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం అంటే సీమాంధ్ర పెత్తన‌మని తెలంగాణ టీడీపీ అంటోంది.. మరి వారు చెబుతున్న రామన్న  రాజ్యం ఏ ప్రాంతానికి చెందిందో వారే సెల‌వివ్వాలి. 

అధికార పార్టీ కుటుంబ రాజకీయం అంటున్నది! మరి వారి పార్టీ ఎలాంటిదో చెప్పాల్సిన బాధ్య‌త లేదా ?  మరోవైపు కుటుంబ సమస్యలు అంటూ విమర్శలు… కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రాజకీయ పార్టీలు పెడతారా ? పెట్టినా మనుగడ సాధ్యమేనా ? షర్మిల లాంటి ప్రభావిత నేతలు రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి రావ‌డాన్ని స్వాగతించాలి.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురిగా తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టబోతున్న షర్మిల ప్రయాణం ప్రజలకు ఉపయోగపడే రీతిలో సాగాలి. అర్థవంతమైన రాజకీయ విధానాలు , ప్రజాసానుకూల నిర్ణయాలతో ముందుకు సాగాలి. 

తన రాజకీయ అడుగులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కు శుభసూచకం కావాలి. అంతిమంగా తాను ఏర్పాటు చేయబోతున్న రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను వైఎస్ వారసురాలిగా తన గౌరవాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆశిద్దాం.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
రాజకీయ విశ్లేషకుడు
9490493436

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి..