నిమ్మగడ్డకు బ్యాడ్ టైమ్ మొదలైనట్టేనా..?

కోర్టు తీర్పులతో జోరుగా, హుషారుగా ఎన్నికలకు సిద్ధమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వ సిబ్బందిపై వేటు వేస్తూ, రాజకీయ నాయకులపై ఆంక్షలు విధిస్తూ, ఏకగ్రీవాలను తూలనాడుతూ.. నానా హంగామా చేశారు. అలాంటి నిమ్మగడ్డకు ఇటీవల…

కోర్టు తీర్పులతో జోరుగా, హుషారుగా ఎన్నికలకు సిద్ధమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వ సిబ్బందిపై వేటు వేస్తూ, రాజకీయ నాయకులపై ఆంక్షలు విధిస్తూ, ఏకగ్రీవాలను తూలనాడుతూ.. నానా హంగామా చేశారు. అలాంటి నిమ్మగడ్డకు ఇటీవల బ్యాడ్ టైమ్ మొదలైంది. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 

తాజాగా గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలపై తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వెనకడుగు వేయాల్సి వచ్చింది. బలవంతపు ఏకగ్రీవాలంటూ రచ్చ చేసిన నిమ్మగడ్డ.. చివరకు ఒక్క చోట కూడా వంక పెట్టకుండా అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇచ్చేశారు కాదు, ఇవ్వాల్సి వచ్చింది.

తొలి దెబ్బ..

ఈ-వాచ్ యాప్ పై స్టేతో నిమ్మగడ్డపై తొలి దెబ్బ పడింది. అప్పటివరకూ తాను ఆడిందే ఆట, పాడిందే పాట, తెచ్చిందే యాప్.. అనుకుంటూ చిందులు తొక్కారు నిమ్మగడ్డ. ప్రభుత్వం తీసుకొచ్చిన నిఘా యాప్ ఉన్నా కూడా ప్రైవేట్ వ్యవహారంగా ఈ-వాచ్ అనే దాన్ని తయారుచేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. 

తీరా యాప్ భద్రతపై ప్రభుత్వం అనుమానాలు లేవనెత్తడం, ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను హైకోర్టు.. ప్రభుత్వ అధీనంలోని సంస్థకు అప్పగించడంతో దానిపై ఆశలు వదిలేసుకున్నారు నిమ్మగడ్డ.

అయ్యయ్యో ఎన్నికల్లో గొడవలు జరుగుతాయి, అభ్యర్థుల్ని బలవంతం చేస్తారు, ప్రజల్ని మభ్యపెడతారు… యాప్ లేకపోతే ఎలా అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన నిమ్మగడ్డ, ఈ-వాచ్ లేకుండా.. చివరకు ప్రభుత్వం తెచ్చిన నిఘా యాప్ అవసరం లేకుండానే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

మలిదెబ్బ.. పెద్దిరెడ్డిపై కోర్టు తీర్పు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంలో నిమ్మగడ్డ వ్యవహార శైలి పూర్తిగా ఓవర్ యాక్షన్ అని హైకోర్టు కూడా నమ్మింది. ఆయన్ని గల్లీ లీడర్ కింద జమకట్టారో లేక, రౌడీ షీటర్ అనుకున్నారో.. ఎన్నికలు అయ్యే వరకు నోరు విప్పొద్దు, గడపదాటొద్దు అంటూ ఆంక్షలు విధించారు.

గడపదాటొద్దు అనడానికి నీకేం అధికారాలున్నాయంటూ కోర్టులు మొట్టికాయలు వేయడంతో ఎస్ఈసీ సైలెంట్ అయ్యారు.

మూడో దెబ్బ ఏకగ్రీవాలపై వెనక్కు తగ్గడం..

ఏకగ్రీవాల్లో బలవంతపు ఏకగ్రీవాలు వేరంటూ హడావిడి చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వచ్చిన ఏకగ్రీవాలను ప్రకటించకూడదంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చి సంచలనం సృష్టించారు. అక్కడినుంచే మంత్రి పెద్దిరెడ్డితో గొడవ మొదలైంది. తీరా ఇప్పుడు ఏకగ్రీవాలపై అనుమానాలు లేవు, ప్రకటించండి అంటూ మరోసారి కలెక్టర్లకు ఆదేశాలిచ్చి కమెడియన్ గా మారిపోయారు నిమ్మగడ్డ.

ఏకగ్రీవాలపై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే, బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులెవరూ గొడవ చేయకుండానే వాటిని బలవంతం అంటూ నిమ్మగడ్డ తీర్మానించడం రాష్ట్ర ప్రజలకి కూడా విచిత్రంగా తోచింది. 

గ్రామస్తులంతా ఏకమై తీసుకున్న నిర్ణయం, అందులోనూ రాజ్యాంగ సమ్మతమైన అంశం.. దానికి నిమ్మగడ్డ అడ్డుకట్ట వేయాలనుకోవడం, ఆయనకు చంద్రబాబు వంతపాడటం.. అంతా పెద్ద డ్రామాలాగా తోచింది. చివరికిప్పుడు తూచ్ అంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ఇద్దరూ నవ్వులపాలయ్యారు.

ఏకగ్రీవాలపై న్యాయపరమైన చిక్కులు వస్తాయని, హైకోర్టుతో మరోసారి మొట్టికాయలు వేయించుకునే పని పడుతుందని ముందుగానే ఊహించిన నిమ్మగడ్డ వెనక్కి తగ్గారు. ఇలా నిమ్మగడ్డ ఎన్ని ఫీట్లు చేసినా ఇంకో నెల రోజులు మాత్రమే. 

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి..

ఆ కలాల వెనుక కులాల ఎజెండా