తొలి ఘట్టం ఆరంభమైంది

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం ఆరంభమైంది. ఎన్నో వివాదాలు, మరెన్నో కీలక నిర్ణయాల మధ్య కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ ఈరోజు ఓటరు వద్దకు వచ్చి ఆగింది. తొలి విడతలో రాష్ట్రంలోని 12…

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం ఆరంభమైంది. ఎన్నో వివాదాలు, మరెన్నో కీలక నిర్ణయాల మధ్య కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ ఈరోజు ఓటరు వద్దకు వచ్చి ఆగింది. తొలి విడతలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కొద్దిసేపటి కిందట పంచాయతీ పోలింగ్ మొదలైంది. 2723 గ్రామ పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తమ ఊరిలో ఓటు వేసేందుకు మరోసారి హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ప్రజలు ఏపీకి క్యూ కట్టారు. గ్రామస్థాయి ఎన్నికలు కావడంతో, తమకు తెలిసిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తంగా 29,732 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఈ పోలింగ్ కేంద్రాల్లో 3594 పోలింగ్ కేంద్రాల్ని అత్యంత సమస్యాత్మక బూతులుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వాటి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేసింది. ఇప్పటికే ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడికక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాను అమల్లోకి తెచ్చారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఏ ఒక్క అభ్యర్థి నచ్చకపోతే నోటా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. అయితే గ్రామస్థాయిలో జరిగే ఎన్నిక కావడంతో ఈ ఆప్షన్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండకపోవచ్చు.

నోటిఫికేషన్ ఇచ్చిన 3249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్లు ఎన్నిక ఏకగ్రీవమైంది. అటు గంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాల్ని ఎన్నికల సంఘం తిరిగి అనుమతించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో అత్యథికంగా ఏకగ్రీవాలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇక కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా సోకిన వాళ్లు మైదాన ప్రాంతాల్లో ఆఖరి గంట ముందు, గిరిజిన ప్రాంతాల్లో చివరి 2 గంటల ముందు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. వీళ్లతో పాటు సాధారణం కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నవాళ్లను కూడా వెనక్కు పంపించి, చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. 

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి..

ఆ కలాల వెనుక కులాల ఎజెండా