వైసీపీ అసంతృప్తులకు రెడ్ కార్పెట్ వేస్తున్న చిన్నమ్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిపెడుతోంది. ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మీద ఆశగా ఎదురుచూస్తోంది. Advertisement అధికారంలో మూడు పార్టీలు ఉన్న…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిపెడుతోంది. ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మీద ఆశగా ఎదురుచూస్తోంది.

అధికారంలో మూడు పార్టీలు ఉన్న నేపథ్యంలో.. తెలుగుదేశం, జనసేన నాయకులు ఎవరు కూడా.. ఆ పార్టీలను వదిలి బిజెపిలోకి వచ్చే అవకాశం లేదు గనుక తదనుగుణంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కూటమిలోని ఇతర పార్టీల వారిని తాము చేర్చుకోబోయేది లేదని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నట్లుగా సంకేతాలు కూడా ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వైసీపీ వారిని మాత్రం చేర్చుకుంటామని, అలాగని పార్టీని పునరావాస కేంద్రంగా మార్చబోయేది లేదని పురందేశ్వరి చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ యిప్పుడు సభ్యత్వ నమోదు మీద దృష్టి సారిస్తోంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని అంటున్న పార్టీ.. ఈసారి కనీసం లక్ష సభ్యత్వాలు పెరగాలని టార్గెట్ నిర్ణయించింది.

మరొకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వలసలపై వారు ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. తమ పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే నాయకులను మాత్రమే చేర్చుకుంటాం అంటూ చిన్నమ్మ చెప్పవచ్చు గాని.. నిజానికి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా సరే చేర్చుకునే స్థితిలో బిజెపి ఉన్నదనేది ప్రజల మాట.

తెలుగుదేశం, జనసేన పార్టీలలోకి ఎంట్రీ అవకాశం లేని వైసిపి నాయకులు బిజెపిలోకి వెళ్లే ఆలోచనతో ఉంటారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుతో విభేదాలు వచ్చినా సరే వైసీపీ నుంచి వచ్చిన నాయకుల ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది ముందు ముందు ఉభయతారకంగా ఉపయోగపడుతుందని బిజెపి ఆలోచన. మరి దగ్గుబాటి పురందేశ్వరి చేస్తున్న పార్టీ విస్తరణ ప్రణాళికలు ఏ మేరకు ఫలితం ఇస్తాయో వేచి చూడాలి.

4 Replies to “వైసీపీ అసంతృప్తులకు రెడ్ కార్పెట్ వేస్తున్న చిన్నమ్మ”

Comments are closed.