మ‌నిషే తిమింగ‌లం

జీవిత‌మ‌నే చౌర‌స్తాలో స‌మ‌యానికి ఏ ట్రాఫిక్ లైటూ వెల‌గ‌దు. ఎటు క‌దిలినా చ‌లానా ప‌డుతుంది

న‌క్ష‌త్రాలు రాలుతున్న రాత్రి, చినుకుల కొర‌డాల శ‌బ్దంలో, ఇటుక‌లు జారిపోయిన పురాత‌న గృహంలోకి ఒక బాట‌సారి వెళుతున్నాడు. ఇంత‌పెద్ద ప్ర‌పంచంలో అత‌నికి కాసింత నీడ‌లేదు. ఆ ఇల్లు కూడా ఒక‌ప్పుడు శోభిత‌మే. గోడ‌ల మీద ప‌సిపిల్ల‌ల న‌వ్వుల గుర్తులున్నాయి. తోర‌ణాలు, పెళ్లి బాజాలు కూడా క‌ల‌ల రెప్ప‌ల కింద దాగున్నాయి. అన్నం వ‌డ్డించిన అరిటాకు ఎండిపోతుంది. ఉత్స‌వం క్ష‌ణికం, బీభ‌త్స‌మే శాశ్వ‌తం.

గంభీర‌మైన స‌ముద్రం కూడా పిల్ల అల‌ల్ని నియంత్రించ‌లేదు. ఒడ్డు కోసం ఎగిరి దుముకుతుంటాయి. త‌ల్లి గ‌బాలున త‌న‌లోకి లాక్కుంటుంది. పెద్ద చేప వుంటుంద‌ని చిన్న చేప‌కి తెలుసు. అయినా అక్క‌డే జీవించాలి. ప్ర‌మాదం లేని స‌ముద్రం ఎక్క‌డైనా వుందా?

ఆకాశం దుక్కిస్తేనే చెట్టు బ‌తికేది. క‌న్నీళ్లు లేని ప‌చ్చ‌ద‌నం లేదు. చిన్న విత్త‌నానికి తెలియ‌దు త‌న‌లో బ్ర‌హ్మాండం దాగుంద‌ని. గులాబీ అల్పాయుష్కురాలు, గుండ్రాయి చిరంజీవి. సుగంధాల‌తో నిండిన జీవితం సూక్ష్మ‌మైనా చాలు.

ఏనుగుని అంద‌రూ గౌర‌విస్తారు. ఆ మ‌ర్యాద త‌న‌కేన‌ని మావ‌టి భ్ర‌మిస్తాడు. అడ‌విలో వుండే ఏనుగుని ఆల‌యం ముందు బంధిస్తారు. అంకుశాన్ని చూసి న‌డుస్తుందే త‌ప్ప దేవున్ని చూసి కాదు. పాప‌పుణ్యాలు మ‌నిషికి చెందిన బ‌ల‌హీన‌త‌లు.

స‌ముద్రంలో తానే బ‌ల‌మైంద‌ని తిమింగ‌లానికి తెలియ‌దు. బ‌లాబ‌లాలు కాదు, బ‌త‌క‌డ‌మే ముఖ్యం. మ‌నిషికి మాత్ర‌మే ర‌క‌ర‌కాల స్వ‌రూపాలుంటాయి. భూమ్మీద సంచ‌రించే తిమింగ‌లం.

నిన్న‌లో వుండ‌లేవు. రేపు నీకు తెలీదు. ఈ క్షణంలో ప్ర‌వ‌హిస్తూ వుండ‌డ‌మే జీవితం. మ‌ర‌ణంతో జీవించేవాడు కాటికాప‌రి. అత‌నికి వేదాంత‌బోధ అన‌వ‌స‌రం.

జీవిత‌మ‌నే చౌర‌స్తాలో స‌మ‌యానికి ఏ ట్రాఫిక్ లైటూ వెల‌గ‌దు. ఎటు క‌దిలినా చ‌లానా ప‌డుతుంది. సిమెంట్ రోడ్డు వుంద‌నుకుంటే , నిలువెత్తు గోతి వుండ‌డ‌మే జీవిత‌మ‌నే జీపీఎస్‌.

బావున్నారా అని అడ‌గ‌డం ఒక రొటీన్ వూత‌ప‌దం. బావున్నామ‌ని చెబితే బాధ‌ప‌డేవాళ్లు ఎక్కువ‌. చ‌ప్ప‌ట్ల శ‌బ్దం గుండెల్లో నుంచి రాదు. అదో అల‌వాటు.

ఎగ‌ర‌క‌పోతే నువ్వో పురుగు. ఎగిరితే సీతాకోక‌చిలుక‌. జ‌నం రెక్క‌ల్ని గౌర‌విస్తారు. రెక్క‌ల క‌ష్టాన్ని కాదు. మంచి వాస‌న వ‌ల్లే గంధం చెక్క‌కి బ‌తుకంతా గాయాలు.

దేవున్ని ప్రేమించేవాడు సైతాన్ని కూడా ప్రేమించాలి. వుంటే ఇద్ద‌రూ వుంటారు, లేకుంటే లేదు. దేవుడి కిరీటాన్ని దొంగ‌లించి, నెత్తిన శ‌ఠ‌గోపం పెట్ట‌డ‌మే మాడ్ర‌న్ లైఫ్ స్కిల్‌.

ఎల‌క్ట్రీషియ‌న్‌తో కార్పెంట‌రీ చేయిస్తే అది కార్పొరేట్ కంపెనీ, భ‌జ‌న‌కి మించిన టాలెంట్ లేదు. చిడ‌త‌ల్ని న‌మ్మిన వాడు చెడిపోడు. మేధావులు కూడా ఇష్ట‌ప‌డే వాయిద్యం డోలు. స్తోత్రం చ‌ద‌వ‌క‌పోతే దేవుడు కూడా వ‌ర‌మీయ‌డు.

శాస్త్రానికి మించిన అస్త్రం పొగ‌డ్త‌. నాయ‌కున్ని పొగ‌డుతూ వుండు. పొడిచినా క‌నుక్కోలేడు. సామ్రాజ్యాలు కూలిపోయేది శ‌త్రువుల వ‌ల్ల కాదు, మిత్రుల వ‌ల్ల‌.

దెయ్యాలిపుడు హార‌ర్ సినిమాల్లో లేవు. సూటూబూటూ, నుదుట బొట్టుతో మ‌న మ‌ధ్య‌నే వున్నాయి. న‌వ్వుతూ భ‌య‌పెడ‌తాయి. న‌క్క‌ల వూళ‌లు, గుడ్ల‌గూబ‌ల కేక‌ల‌కి ఇపుడు ఎవ‌డూ భ‌య‌ప‌డ‌డు. ఫోన్‌ మోగితే చాలు.

జీఆర్ మ‌హ‌ర్షి

9 Replies to “మ‌నిషే తిమింగ‌లం”

  1. G.R. Maharshi is testing our patience with this kind flowless article.. just spreading some quotable quotes through out.. We expect better articles from him, but this kind is disappointing…

  2. మనిషికి మూడు మార్గాలు

    చీకటిని తిడుతూ కూర్చోవడం

    వెలుగు కోసం ప్రయత్నిస్తూ ఉండటం

    వెలుగుని ఒడిసిపట్టుకుని చీకటిని పారద్రోలడం.

    లేకపోతె విస్కీ తాగుతూ చికెన్ బిర్యానీ తింటూ, ఇంత టాక్స్ కట్టాలా అని బాధపడుతూ కవిత్వం రాయడం…

Comments are closed.