రవితేజ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం 7 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారట. రవితేజ సినిమాకు 7 కోట్ల రూపాయల సెట్ అంటే అది అత్యంత భారీ వ్యవహారం కింద లెక్క. ఇంకాస్త వెనక్కి వెళ్తే, రవితేజ తన రెమ్యూనరేషన్ ను కూడా పెంచినట్టు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు అటుఇటుగా 17-19 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట.
అంటే.. రవితేజతో సినిమా నిర్మించాలంటే, ఇంతకుముందు వేసుకున్న లెక్కలు పనికిరావన్నమాట. బడ్జెట్ ను కనీసం 40శాతం పెంచాల్సి వస్తోంది. మరి ఆ రేంజ్ లో రవితేజ సినిమాలు ఆడుతున్నాయా? నిర్మాతలకు డబ్బులు వెనక్కి వస్తున్నాయా?
రీసెంట్ గా రవితేజ నటించిన సినిమా ఖిలాడీ. అతడి కెరీర్ లోనే అప్పటివరకు బిగ్ బడ్జెట్ మూవీ అదే. ఆ సినిమా ఫ్లాప్ అయింది. మినిమం బడ్జెట్ లో తీసుంటే యావరేజ్ అయి ఉండేదనేది బయ్యర్ల మాట. మొత్తమ్మీద అది కాస్ట్ ఫెయిల్యూర్ అనేది అందరి మాట.
ఇప్పుడు ఖిలాడీని మించేలా టైగర్ నాగేశ్వరరావు వస్తోంది. ఈసారి దీనికి పాన్-ఇండియా అనే కలరింగ్ కూడా ఇచ్చారు. రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా అంటున్నారు. మరి ఏ ధైర్యంతో నిర్మాత ఇంత బడ్జెట్ పెడుతున్నాడు?
రవితేజ సినిమాలు క్లిక్ అయితే 40-45 కోట్లు ఎటూ పోవు. ఆటోమేటిగ్గా రిటర్న్స్ వచ్చేస్తాయి. క్రాక్ సినిమా ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. కానీ ఆడే సినిమాల కంటే పోయేవే ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఫ్లాప్ అయితే పరిస్థితేంటి? సరిగ్గా ఇక్కడే నాన్-థియేట్రికల్ రైట్స్ తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ సినిమాకు నాన్-థియేట్రికల్ మార్కెట్ అటుఇటుగా 40 కోట్ల రూపాయలు ఉంది. వీటిలో హిందీ డబ్బింగ్ రైట్స్ దే అగ్రతాంబూలం.
రవితేజతో సినిమాలు తీసే నిర్మాతల ధైర్యం ఇదే. అందుకే అతడు పారితోషికం పెంచినా పర్లేదంటున్నారు.