రిలీజ్ డేట్ చెప్పారు, ప్రచారం స్టార్ట్ చేశారు, వాయిదా వేశారు. మళ్లీ రిలీజ్ డేట్ చెప్పారు, ప్రచారం షురూ చేశారు, మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. ఇలా విడుదలతో దాగుడుమూతలు ఆడుతున్న శేఖర్ సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి మే 20 అంటున్నారు.
రాజశేఖర్ నటించిన 91వ సినిమా ఇది. లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్ నుంచి వస్తున్న మూవీ కావడం, పైగా మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ అవ్వడంతో..శేఖర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఆ అంచనాల్ని అలానే కొనసాగించలేకపోతోంది యూనిట్. వరుస వాయిదాలు ఈ సినిమా బజ్ పై ప్రభావం చూపిస్తున్నాయి.
రాజశేఖర్ ఇందులో తన వయసుకు తగ్గ పాత్ర చేస్తున్నారు. పైగా కూతురుతో కలిసి నటించిన తొలి సినిమా కూడా. రియల్ లైఫ్ తండ్రికూతుళ్లతో సినిమాలో తీసిన సన్నివేశాలు, సాంగ్ బాగా వచ్చాయనే టాక్ కూడా ఉంది. జీవిత రాజశేఖర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
శేఖర్ మూవీకి మార్కెట్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఒక దశలో డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద డీల్ క్లోజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ థియేటర్లలో రిలీజైతే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో, ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో జార్జిరెడ్డి ఫేమ్ ముస్కాన్ హీరోయిన్ గా నటించింది.