కర్నూలు జిల్లాలో భూమా కుటుంబంలో విభేదాలు హైవేకెక్కాయి. భూమా అఖిలప్రియ వైఖరి తమ కుటుంబ పరువు పోతోందని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ వైఖరిపై కర్నూలు జిల్లాలో సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ వ్యవహారశైలి జిల్లా అంతటా పార్టీకి నష్టం కలిగిస్తోందని వారంతా చంద్రబాబు, లోకేశ్‌లకు మొర పెట్టుకున్నట్టు సమాచారం.
భూమా అఖిలప్రియ దౌర్జన్యంపై నంద్యాల ఎస్సీకి ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్, భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిషోర్‌రెడ్డి ఫిర్యాదుతో కుటుంబ విభేదాల గురించి చర్చ తెరపైకి వచ్చింది. మరోసారి అఖిలప్రియ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కోవడం టీడీపీని ఇబ్బందికి గురి చేస్తోంది. భూమా అఖిలప్రియ, కిషోర్‌రెడ్డి మధ్య గత కొంత కాలంగా పచ్చగడ్డ వేస్తే భగ్గమంటోంది. వివిధ కారణాలతో అఖిలప్రియ ప్రజలకు దూరంగా ఉండడం, మరోవైపు గడగడపకూ కిషోర్‌రెడ్డి పాదయాత్రగా వెళ్లడం ఆళ్లగడ్డలో ఆసక్తికర పరిణామం.
ఆళ్లగడ్డ టికెట్ కిషోర్‌రెడ్డికే అనే చర్చ రోజురోజుకూ బలపడుతోంది. తన రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా మారిన కిషోర్‌రెడ్డిపై అఖిలప్రియ సహజంగానే అక్కసుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, కిషోర్‌రెడ్డి అనుచరులతో కలిసి తమ పనులపై వేర్వేరుగా నంద్యాలకు బయల్దేరారు. హైవేపై వెళుతున్న అఖిలప్రియ కాన్వాయ్‌ని కిషోర్‌రెడ్డి వాహనాలు క్రాస్ చేశాయి. కిషోర్‌రెడ్డికి సంబంధించిన ఒక వాహనాన్ని అఖిలప్రియ అనుచరులు హైవే అడ్డుకున్నారు. రక్షణగా వెంటే రావాల్సిన వాహనం కనిపించకపోవడంతో కిషోర్‌రెడ్డికి అనుమానం వచ్చి, తిరిగి వెనుతిరిగారు.
సిరివెళ్లకు కిలోమీటర్ దూరంలో తన అనుచరుల వాహనాన్ని అఖిలప్రియ, ఆమె అనుచరులు అడ్డుకోవడంపై కిషోర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ముఖ్య అనుచరుడైన చాకలి శీనును కిడ్నాప్ చేసేందుకు అఖిలప్రియ ప్రయత్నించిందని కిషోర్‌రెడ్డి ఆరోపణ. సంఘటనా స్థలంలోనే అఖిలప్రియ, ఆమె అనుచరులను కిషోర్‌రెడ్డి రాయలేని భాషలో తిట్టిపోశారు. మరోసారి కిడ్నాప్ ప్రయత్నాలు చేస్తే… చేతికి పని చెప్పాల్సి వుంటుందని హెచ్చరించారు. ఈ తతంగం అంతా హైవేపై దాదాపు 45 నిమిషాలు చోటు చేసుకుంది. జనాలంతా సినిమా చూసినట్టు వీక్షించారు. ఇదిలా వుండగా చాకలి శీను గతంలో భూమా నాగిరెడ్డికి 20 ఏళ్లపాటు అంగరక్షకుడిగా, డ్రైవర్‌గా పని చేసినట్టు సమాచారం.
నాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియ విధానాలు నచ్చక, అదే కుటుంబానికి చెందిన కిషోర్‌రెడ్డి వెంట నడుస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక, అతన్ని కిడ్నాప్ చేసి, భయపెట్టి తనకు దూరం చేయాలని ప్రయత్నించినట్టు కిషోర్ ఆరోపణ. అఖిలప్రియ కిడ్నాప్ ప్రయత్నాలు, అలాగే ఆళ్లగడ్డలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని నంద్యాల ఎస్సీకి కిషోర్ ఫిర్యాదు చేయడం కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలపై టీడీపీ మరోసారి అవాక్కైంది.