నాలుగో వేవ్ ముప్పు.. ఇకపై బాధ్యత ప్రజలదే

ఇప్పటికే మూడు వేవ్స్ చూశాం. నాలుగో వేవ్ కూడా అనివార్యం అంటున్నారు అధికారులు. కాకపోతే సెకెండ్ వేవ్ అంత ఇబ్బంది పెట్టదని కూడా చెబుతున్నారు. జులై నుంచి దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని…

ఇప్పటికే మూడు వేవ్స్ చూశాం. నాలుగో వేవ్ కూడా అనివార్యం అంటున్నారు అధికారులు. కాకపోతే సెకెండ్ వేవ్ అంత ఇబ్బంది పెట్టదని కూడా చెబుతున్నారు. జులై నుంచి దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. అయితే ఈసారి బాధ్యత మాత్రం ప్రజలదే. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రజలే ఎక్కువ బాధ్యతతో ఉండాలి.

ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాయి. హర్యానా లాంటి రాష్ట్రాలైతే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నాయి కూడా. ఢిల్లీతో పాటు గురుగ్రామ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. కరోనాపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

సెకెండ్ వేవ్ తరహాలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేయడం లాంటివి ఫోర్త్ వేవ్ లో ఉండవని హర్యానా తెగేసి చెప్పేసింది. దాదాపు ఇదే విషయాన్ని ఢిల్లీ కూడా పరోక్షంగా చెబుతోంది. సో.. దాదాపు రాష్ట్రాలన్నీ ఇదే పద్ధతి ఫాలో అయ్యేలా ఉన్నాయి. ఇకపై కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువైతే, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలది కూడా.

ఫోర్త్ వేవ్ లో భయపడాల్సిన విషయం ఏంటంటే ఇది పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇక కూసింత ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ఇది ప్రాణాంతకం కాదంటున్నారు వైద్యులు. గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, దగ్గు లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు. అయినప్పటికీ వ్యాపిస్తోంది పిల్లల్లో కాబట్టి అశ్రద్ధ తీసుకోవద్దని సూచిస్తున్నారు.

ఢిల్లీలో ఇప్పటికే పాఠశాలలు మూతపడ్డాయి. ఇది ఫోర్త్ వేవ్ కు దారితీస్తుందా లేదా అనే విషయంపై అక్కడి అధికారులు, వైద్యులు పరిశోధన చేస్తున్నారు. మరోవైపు కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈమధ్య ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఎదురుచూడకుండా, అంతా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.