అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ స్వాగత ర్యాలీ వల్ల ఓ చిన్నారి సకాలంలో వైద్యం అందక చనిపోయిందనేది ప్రచారంలో ఉన్న కథనం. సోషల్ మీడియాలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఎల్లో మీడియా పండగ చేసుకుంది. పసిబిడ్డ చావుకి కారణమైన మంత్రి, మంత్రి ర్యాలీ కోసం బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ రకరకాల హెడ్డింగులు పెట్టి నిజమే అన్నట్టు చిత్రీకరించారు. ప్రతిపక్షాలు మంత్రిపై దుమ్మెత్తిపోశాయి. పెద్ద రాద్ధాంతం చేశాయి. హంగు ఆర్భాటాల కోసం పసిబిడ్డ ప్రాణాలు తీస్తారా అని రెచ్చిపోయారు కొందరు నేతలు.
కానీ అనంతపురం పోలీసులు కౌంటరిచ్చారు. మామూలుగా కాదు, సీసీ కెమెరా ఫుటేజీ సాక్షిగా, సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా, హాస్పిటల్ బిల్స్ చూపిస్తూ, పక్కా సమాచారంతో ఆ వార్తలు తప్పు అని నిరూపించారు.
ఉషశ్రీ చరణ్ ర్యాలీ కోసం పోలీసులు రోడ్డుపై బ్యారికేడ్లు పెట్టిన మాట నిజమే. చెర్లోపల్లికి చెందిన గణేష్, ఈరక్క దంపతులు తమ చిన్నారికి ఫిట్స్ రావడంతో కల్యాణ్ దుర్గం ఆస్పత్రికి బైక్ పై బయలుదేరారు. రోడ్డుకి అడ్డుగా బ్యారికేడ్లు ఉండటంతో పక్కనుంచి వెళ్లారు. అక్కడ వారిని అడ్డుకోవడం కానీ, ఆలస్యం కావడం కానీ జరగలేదు. బైక్ ఆస్పత్రి వెళ్లే వరకు ఎక్కడా ఆగలేదు. అంటే పోలీసుల నిర్లక్ష్యం అందులో ఎంతమాత్రం లేదు.
ఫిట్స్ తో ఆ పాప ఆస్పత్రిలో చేరిన తర్వాత చనిపోయింది. ఆ తర్వాతే హైడ్రామా మొదలైంది. ఎవరు చెప్పారో, ఏం జరిగిందో తెలియదు కానీ.. గణేష్, ఈరక్క దంపతులు బిడ్డను పట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే మెయిన్ స్ట్రీమ్ మీడియా అందుకుంది. పసిబిడ్డను అన్యాయంగా చంపేశారంటూ బురదజల్లింది.
ఈ వ్యవహారం పెద్దది కావడంతో అనంతపురం జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజీ పట్టుకున్నారు, గణేష్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని కూడా ట్రేస్ చేశారు. పసిబిడ్డ వెళ్లే బైక్ ని పోలీసులు ఎక్కడా ఆపలేదని రుజువు చేశారు. 20కిలోమీటర్ల దూరాన్ని 38 నిముషాల్లో వారు బైక్ పై వెళ్లారని ఆధారాలతో సహా బయటపెట్టారు. బిడ్డ చనిపోయిన గంట తర్వాత రాద్ధాంతం మొదలైందనే విషయాన్ని కూడా గుర్తించారు.
ఇలా ఉండాలి పోలీస్ టీమ్ వర్క్. గుడ్డిగా ఖండించకుండా ఆధారాలతో చూపెడితే ఎల్లో కథనాలపై ప్రజలకు ఏవగింపు కలగడం ఖాయం. అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తే ఎవరూ నమ్మేవారు కాదేమో.. పోలీసులు మీడియా ముందుకొచ్చి ఆధారాలు చూపెట్టడంతో ఎల్లో మీడియా ఎలా విషం చిమ్ముతుందో అందరికీ అర్థమైంది. ఈ విషయంలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గంటల వ్యవధిలోనే ఏది నిజం, ఏది అబద్ధం అని నిరూపించగలిగారు.
చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేసినప్పటికీ, వాళ్లు మాయమాటలు నమ్మారని, అమాయకులని, వారిపై ఎలాంటి కేసు పెట్టడం లేదని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు.