సంభాష‌ణ‌ల్లో… మౌనంగా ఉండాల్సిన సంద‌ర్భాలు!

‘నువ్వు నోరు మూసుకోవాల్సిన సంద‌ర్భం ఏదంటే.. నువ్వు ఏదైనా చెప్పాల‌నుకుంటావే అప్పుడు..’ అని అన్నారొక మ‌హ‌నీయుడు. ప‌దాలు చాలా ప‌దునైన‌వి, మాట‌లుగా వాటిని వాడి ఎన్నింటినో సాధించ‌వ‌చ్చు. వాక్కుకున్న ప‌దును వాడి క‌త్తికైనా లేద‌న్నారు.…

‘నువ్వు నోరు మూసుకోవాల్సిన సంద‌ర్భం ఏదంటే.. నువ్వు ఏదైనా చెప్పాల‌నుకుంటావే అప్పుడు..’ అని అన్నారొక మ‌హ‌నీయుడు. ప‌దాలు చాలా ప‌దునైన‌వి, మాట‌లుగా వాటిని వాడి ఎన్నింటినో సాధించ‌వ‌చ్చు. వాక్కుకున్న ప‌దును వాడి క‌త్తికైనా లేద‌న్నారు. మాట‌ల‌తో మాయ‌లు చేయొచ్చు. మెప్పింవ‌చ్చు, నిరూపించ‌వ‌చ్చు, ఎన్నో సాధించ‌వ‌చ్చు. అయితే కొన్ని సార్లు మాట‌ల క‌న్నా మౌనం గొప్ప‌ద‌వుతుంది! మాట‌లు అక్క‌డ అర్థ‌ర‌హితం అవుతాయి. మీరెంత మాట‌కారి అయినా, మీరు ఎంత‌టి మాట‌ల మాంత్రికుడు అయినా, మౌనంగా ఉండ‌ట‌మే కొన్ని సార్లు మెప్పును సాధిస్తుంది. మాట‌ల ప‌దును తెలిసిన వారికి మౌనం విలువ కూడా తెలిసి ఉండాలి.

తెలిసినా, తెలియ‌క‌పోయినా.. మౌనంగా ఉండాల్సిన సంద‌ర్భాలు అయితే కొన్ని ఉంటాయి. అవి జీవితంలో ఎదురైన‌ప్పుడు మాట్లాడితే విలువ‌ను కోల్పోతారు. మౌనంగా ఉంటే, మ‌రో మెట్టుకు ఎదుగుతున్న‌ట్టే! మ‌రి అలాంటి సంద‌ర్భాలు ఏమిటంటే!

అవ‌త‌లి వారే మాట్లాడాల్సిన‌ప్పుడు!

ఇది నిజం, అవ‌త‌లి వారు మాట్లాడ‌ట‌మే స‌హేతుకం అనిపించిన‌ప్పుడు మీరు మౌనాన్ని ఆశ్ర‌యించ‌డ‌మే మంచిది. అవ‌త‌లి వారి ద‌గ్గ‌రే స‌మాచారం ఉన్న‌ప్పుడు, ఆ సంద‌ర్భంలో వారే మాట్లాడాల్సిన‌ప్పుడు వారినే మాట్లాడ‌నివ్వాలి. తెలివైన మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం కూడా ఇది. ఎంత‌సేపూ మీరే ఎందుకు మాట్లాడాల‌నే ప్ర‌శ్న‌ను వేసుకోవ‌చ్చు. వారిని మాట్లాడ‌నివ్వ‌డం, వారినే మాట్లాడించేలా చేయ‌డం కొన్ని సంద‌ర్భాల్లో అవ‌స‌రం కూడా. ఇలాంటి సంద‌ర్భాల‌ను గ్ర‌హించి అవ‌తలి వారిని స్పందింప‌జేయ‌గ‌ల మౌనం చాలా మేలైన‌ది!

వాదోప‌వాదాల్లో!

అయిన‌వారితో వాదోప‌వాదాల స‌మ‌యంలో అతి తెలివులు ఉప‌యోగించి లాజిక్ ల‌ను ఉప‌యోగించ‌డ‌మో లేక గ‌తాన్నంతా తోడిపోయ‌డ‌మో కాకుండా.. వాదోప‌వాదాల స‌మ‌యంలో కాస్త త‌గ్గిన‌ట్టుగా అనిపించినా మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం మంచిది. ఎంత వ‌ర‌కూ చెప్పాలో అంత వ‌ర‌కూ చెప్పేసి ఆ త‌ర్వాత మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం చాలా స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది లేక‌, స‌మ‌స్య‌ను తీవ్ర స్థాయి తీసుకెళ్ల‌కుండా ఆపుతుంది. ఇది మాన‌సిక ప‌రిణ‌తికి నిద‌ర్శ‌నం కూడా!

అవ‌తలి వారు తీవ్ర బాధ‌లో ఉన్న‌ప్పుడు!

అవ‌త‌లి వారు తీవ్ర‌మైన దుఃఖంలో ఉన్న‌ప్పుడు, వారు జీవితంలో ఏదైనా కోల్పోయిన బాధ‌లో ఉన్న‌ప్పుడు.. అది కూడా వారు దుఃఖంలో కూడా తీవ్ర స్థాయిలో ఉన్న‌ప్పుడు మాట్లాడించాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌డం కానీ, ఏదో ఒక‌టి మాట్లాడటం కానీ స‌రికాదని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారిని ఓదార్చాల్సిన అవ‌స‌రం ఉండొచ్చు, కానీ ఓదార్పుకు మాట‌లే అవ‌స‌రం కాదు. వారి ప‌క్క‌న మౌనంగా నిల‌బ‌డినా చాలు అదే వారికి ఓదార్పు కావొచ్చు. వారు తీవ్ర‌మైన మాన‌సిక దుఃఖంలో ఉన్న‌ప్పుడు వేరే ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌స్తావించ‌డం, వారిని డైవ‌ర్ట్ చేయ‌డానికే అంటూ అన‌వ‌స‌ర‌మైన విష‌యాల ప్ర‌స్తావ‌న చేయ‌డం కూడా సరికాద‌ని గ్ర‌హించ‌డం విజ్ఞ‌త‌.

గాసిప్స్ పై మౌన‌మే స్పంద‌న‌!

ఆఫీసులోనో, బంధువులు, స్నేహితుల మ‌ధ్య‌నో, అపార్ట్ మెంట్ వ్య‌వ‌హారాల్లోనో.. త‌ర‌చూ గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌టి చెబుతూ ఉంటారు. అయితే అలాంటి వాటిని వినీవిన్న‌ట్టుగా ప‌ట్టించుకోక‌పోవ‌డం ఉత్త‌ముల ల‌క్ష‌ణం. ఎవ‌రో ఒక‌టి ఏదో ఒక‌టి చెబితే, దాన్ని మ‌రింత‌మందికి స్ప్రెడ్ చేసి టాంటాం చేసే బ్యాచ్ లు చాలానే ఉంటాయి. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో నోటికి అడ్డుక‌ట్ట వేసుకోవాల్సిన అవ‌స‌రం చాలా ఉంటుంది. ఆ గాసిప్స్ సృష్టికర్త‌లు మీరు కాక‌పోయినా, ప్ర‌చార క‌ర్త‌లుగా మాత్రం ఆ త‌ర్వాత అభాసుకావాల్సి వ‌స్తుంది. లేనిపోని వైరాల‌ను తెచ్చుకోవాల్సి వ‌స్తుంది.

పూర్తి స‌మాచారం లేన‌ప్పుడు!

ఆఫీసుల మీటింగుల్లో కావొచ్చు, ఇత‌ర సంద‌ర్భాల్లో కావొచ్చు… మీ ద‌గ్గ‌ర పూర్తి స‌మాచారం లేకుండా మాట్లాడాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌డం మొద‌టికే మోసాన్ని తీసుకురావొచ్చు. మీ ద‌గ్గ‌ర పూర్తి స్థాయిలో స‌మాచారం అయినా ఉండాలి, లేదా మీకు ఉన్న అవ‌గాహ‌న ఎంతో అయినా చెప్ప‌గ‌ల‌గాలి, అలా కాకుండా మీ మేధ‌స్సును అతిగా అంచ‌నా వేసుకుని కానీ, మీ గురించి హైలెట్ చేసుకోవాల‌న్న తీరుతో కానీ… మాట్లాడాల‌నే ప్ర‌య‌త్నాలు చేయ‌డం స‌బ‌బు కానే కాదు!

7 Replies to “సంభాష‌ణ‌ల్లో… మౌనంగా ఉండాల్సిన సంద‌ర్భాలు!”

  1. ఏమి సమాచారం లేకుండానే అతిగా మాట్లాడడమే కాన్ఫిడెన్స్ గా పరిగణించబడుతున్న కాలమిది.

  2. ఈ కాలంలో ఎవరిది తప్పైతే వాళ్ళే పెద్ద గొంతుతో అదీ ఎక్కువగా మాట్లాడాలి అనేదే సంప్రదాయంగా మారింది

Comments are closed.