ప్రధాని మోడీని రైతు ఉద్యమం బాగా ఇరిటేట్ చేస్తున్నట్టుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా రెండు నెలలకు పైగా సాగుతున్న రైతు ఉద్యమం మోడీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఎలాగైనా రైతు ఉద్యమాన్ని అణచివేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని కేంద్రప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. రైతాంగ ఉద్యమ ఒత్తిడి ప్రధాని మోడీపై స్పష్టంగా కనిపిస్తోంది. అసోంలోని దేఖియాజూలీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం గందరగోళంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను చెప్పాలనుకున్నదాన్ని చెప్పలేక పోయారని స్పష్టంగా తెలుస్తోంది. అసలు విషయం కాకుండా మరేవో ఆయన చెప్పారనే టాక్ నడుస్తోంది.
కొందరు విదేశాల్లో కూర్చొని దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. అలాంటి వారు కనీసం భారత్‌కు చెందిన ఛాయ్‌ని కూడా భరించే స్థితిలో లేరని ఆరోపించారు.
‘నేను ఛాయ్‌వాలా గురించి మాట్లాడుతున్నాను. దేశాన్ని కొందరు ఎలా అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారో మీకు వివరిస్తా. ఎంతలా కుట్ర పన్నుతున్నారంటే.. కనీసం భారత్‌కు చెందిన ఛాయ్‌ని కూడా ద్వేషించేంతలా.
భారత్‌కు చెందిన ఛాయ్‌కి ఎంత ఇమేజ్ ఉందో, దానంతటినీ ధ్వంసం చేయాలని చూస్తున్నారు. భారత్‌కు చెందిన ఛాయ్‌కి విదేశాల్లో మంచి పేరుందని, ఆ పేరును తుడిచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం మౌనంగా ఉన్నాయి’ అని మోదీ తీవ్రంగా ఆరోపించారు.
ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న రైతాంగ ఉద్యమం గురించి మాట్లాడకుండా, దాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రధాని ఛీప్ ట్రిక్స్ ప్లే చేశారనే విమర్శలు రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. విదేశాల్లో ఛాయ్‌కి ఉన్న మంచిపేరును తుడి చేయడానికి ప్రయత్నించడమేంటి? దాని గురించి రాజకీయ పార్టీలు మాట్లాడాలని ప్రధాని కోరడం ఏంటి? ఎక్కడైనా ప్రధాని ప్రసంగం పేలవంగా సాగిందనేందుకు ఇదే నిదర్శనంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
కుట్రదారు కంటే తేయాకు కార్మికులే బలమైన వాళ్లని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఈ విషయం తెలుసుకోవాల్సింది మోడీనే అని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
ఎందుకంటే 80 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా రైతులు వాన, చలి, కరోనాను లెక్క చేయకుండా ఉద్యమం చేస్తున్నారంటే, వాళ్ల ఆశయ సంకల్పం ఎంత బలమైందో ప్రధాని గుర్తెరిగి సానుకూల నిర్ణయం తీసుకోవాలనే హితవులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.