హంబలే ఫిల్మ్స్ సంస్థకు ఓ రికార్డు వుంది. ఎంత భారీ సినిమా అయినా స్వంతంగా విడుదల చేసుకోవడం. కేజిఎఫ్ 2 విడుదలకు కొద్ది రోజులు ముందు తీసుకున్న అడ్వాన్స్ లు కూడా తిరిగి ఇచ్చేసి, చాలా నామినల్ కమిషన్ మీద స్వంతంగా విడుదల చేయించుకున్నారు.
ఇలా చేయడం అన్నది నిజానికి రిస్క్ తో కూడిన పని. సినిమా మీద నూటికి రెండు వందల శాతం నమ్మకం ఉంటే తప్ప ఇలా చేయలేరు ఎవ్వరూ. థియేటర్ లో పడే వరకు సినిమా భవిష్యత్ ఊహించడం ఎవరికీ పూర్తిగా సాధ్యం కాని పని. పైగా ఎంత వసూలు చేస్తుంది అన్నది అసలే ఊహించలేరు. అందువల్లే కేజిఎఫ్ 2 విషయంలో నిర్మాణ సంస్థ చేసింది నిజంగా పెద్ద రిస్క్ నే.
తరువాత అదే సంస్థ కాంతారా సినిమా విషయంలో కూడా అదే పని చేసింది. అయితే అది మరీ ఎక్కువ బడ్జెట్ సినిమా కాదు. పైగా అందువల్లే అపరిమితమైన లాభాలు సంపాదించారు. కానీ ఇప్పుడు సలార్ విషయానికి వస్తే మాత్రం అదే సంస్థ రివర్స్ లో ఆలోచిస్తోంది. తెలుగు నాట సలార్ హక్కులను విక్రయించే ప్రయత్నం చేస్తోంది.
ఆంధ్ర ఏరియాకు 70 నుంచి 80 కోట్ల రేషియోలో అమ్మాలని చూస్తున్నారు. నైజాం కూడా దాదాపు ఇదే రేంజ్ రేటు కోట్ చేస్తున్నారు. కేజిఎఫ్ 2 ఆ టైమ్ లో 70 కోట్ల మేరకు వసూళ్లు సాగించింది. అయినా కూడా ఇప్పుడు నైజాంలో ఎవ్వరూ 70 నుంచి 80 కోట్ల మేరకు ఇచ్చి సలార్ ను కొనేందుకు సిద్దపడడం లేదు. 50 కోట్ల మేరకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కు మొగ్గు చూపుతున్నారు తప్ప, ఆ పైన మరిన్ని కోట్లు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఈ మేరకు డిస్కషన్లు జరుగుతున్నాయి.
ఆంధ్ర 70 కోట్ల రేషియో అంటే ఒక్క ఉత్తరాంధ్రనే 16 కోట్ల మేరకు పడుతుంది. ఈ మేరకు వసూళ్లు సాగించాలంటే సరైన సీజన్ అవసరం. పైగా కేజిఎఫ్ 2 లాంటి టాక్ రావాల్సి వుంటుంది. సలార్ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ వుంటుంది. అందులో సందేహం లేదు. కానీ సినిమా ఆ రేంజ్ లో వుంటేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. లేదంటే ఆదిపురుష్ పరిస్థితి అవుతుంది. అందుకే బయ్యర్లు ముందు వెనుక ఆడుతున్నారు.