ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తనను పోల్చొద్దని టీడీపీ యువనేత నారా లోకేశ్ మీడియా ప్రతినిధులను అభ్యర్థించారు. లోకేశ్ మాటలు నవ్వు తెప్పిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సాగుతోంది.
ఈ సందర్భంగా లోకేశ్‌ను ఎల్లో మీడియా ప్రతినిధులు …జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యారని, ఆ తర్వాత ఆయన ఎవరినీ పట్టించుకోలేదన్నారు. మీరు జగన్ మాదిరే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి లోకేశ్ స్పందిస్తూ…. దయచేసి తనను జగన్‌తో పోల్చొద్దని విజ్ఞప్తి చేశారు. ఏమయ్యా, ఎందుకని ప్రశ్నించగా…తాను పది నిర్ణయాలు తీసుకుంటే ఒకట్రెండు తప్పులు జరుగుతుంటాయన్నారు. కానీ వాటిని తాను సరి చేసుకుంటానని, జగన్‌లా మొండిగా వ్యవహరించనని సెలవిచ్చారు. ఈ కారణంగానే తనను జగన్‌తో పోల్చొద్దని లోకేశ్ కోరారు.
అసలు పనులేవైనా చేస్తేనే తప్పొప్పలకు ఆస్కారం వుంటుంది. 2014లో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎంత వరకూ నెరవేర్చారో అందరికీ తెలుసు. రైతుల రుణమాఫీ ఉత్తుత్తిదే అని తేలిపోయింది. మూడు విడతలు మాత్రమే చెల్లించి, మిగిలిన రెండు విడతల సొమ్మును చంద్రబాబు సర్కార్ మాఫీ చేయలేదు. దీంతో రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి కూడా అంతే. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటీన్లు గుర్తుకొచ్చాయి. చంద్రబాబు పాలన మంచిగా వుంటే జనం ఎందుకు ఓడిస్తారు? బాబు మాటల ప్రభుత్వమే తప్ప చేతలది కాదని జనం గ్రహించడం వల్లే జగన్‌ను ఆదరించారు.
ఇప్పుడు లోకేశ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కోతలు కోయడంలో తండ్రిని మించిన తనయుడు అయ్యారనే పేరు తెచ్చుకున్నారు. జగన్‌తో లోకేశ్‌కు పోలిక ఎక్కడ? జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కష్టపడి అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకట్రెండు తప్ప మిగిలివన్నీ నెరవేర్చారు. కానీ లోకేశ్ పరిస్థితి ఏంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడిగా చెలామణి అవుతున్నారు.
ఇంత వరకూ లోకేశ్ సొంతంగా ఏదైనా చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఏమీ లేదని వస్తుంది. చివరికి మంగళగిరిలో కూడా గెలవలేని పరిస్థితి. లోకేశ్‌తో తనను పోల్చుతున్నారని తెలిస్తే, జగన్ సిగ్గు పడతారే తప్ప, యువ నాయకుడికి ఎందుకో అర్థం కావడం లేదు. కామెడీ కాకపోతే!