మధుమేహం ఉందా.. రాత్రి అన్నం మానేసి చపాతి తిను. బరువు పెరుగుతున్నారా.. రాత్రి అన్నం మానేసి చపాతి తిను. వయసు 50 దాటిందా.. రాత్రి అన్నం మానేసి చపాతి తిను. ఇలా ప్రతి దానికి చపాతీ ఓ దివ్యౌషధం అనే రీతిలో తయారైంది. దీనికితోడు కార్పొరేట్ కంపెనీల ప్రచారం కూడా అదే స్థాయిలో సాగుతోంది. ఇంతకీ గోధుమలతో చేసే చపాతీలు, రోటీలు నిజంగా మంచివేనా? పుట్టినప్పట్నుంచి రైస్ కు అలవాటుపడిన శరీరం, గోధుమలను తట్టుకుంటుందా?
ఉన్నఫలంగా అన్నం మానేసి చపాతీలు ప్రారంభించడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఓ పూట మొత్తం అన్నం మానేయడం కంటే.. కాస్త అన్నం తగ్గింది ఆ స్థానంలో చపాతీ తినమని సూచిస్తున్నారు. అలా క్రమక్రమంగా రైస్ పరిమాణం తగ్గిస్తూ, గోధుమల పరిమాణం పెంచాలని సూచిస్తున్నారు.
సడెన్ గా రోజువారీ ఆహారంలో భాగంగా చపాతీలు స్టార్ట్ చేస్తే, ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. సీలిక్ వ్యాధులు, గోధుమల వల్ల కలిగే ఎలర్జీలు, గ్లూటెన్ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. వీటికి సైడ్ ఎఫెక్టులుగా తలనొప్పి, విరేచనాలు అవ్వడం లాంటిది చెబుతున్నారు.
గోధుమల్లో జిగటగా ఉండే గ్లూటెన్, గ్లయాటిన్ అనే ప్రొటీన్లు పేగులకు అంటుకుంటాయి. దీని వల్ల పేగులకు అవసరమైన పోషకాలు అందకుండా పోతాయి. తద్వారా చిరాకు, అసహనం, తలనొప్పి, విరోచనాలు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని నివారించేందుకు ముందుగా గోధుమ ఉత్పతుల్ని దశలవారీగా శరీరానికి అలవాటు చేయాలని చెబుతున్నారు.
మరోవైపు రాత్రిపూట అన్నం మానేసి చపాతి తినడం వల్ల షుగర్ తగ్గుతుందనేది కూడా సగం నిజం మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోధుమలతో చేసే రోటీల్లో గ్లైసమిక్ ఇండెక్స్ (షుగర్ ఉత్పత్తి చేసే ఎంజైమ్) 65గా ఉంటే.. అన్నంలో ఈ ఇండెక్ట్ 73కు అటుఇటుగా ఉంటుంది. అంటే తేడా చాలా స్వల్పం అన్నమాట. అదే గోధుమల స్థానంలో బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం) తింటే ఎలాంటి తేడా ఉండదంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం మార్కెట్ మొత్తం ప్రాసెస్ చేసిన గోధుమ పిండితో నిండిపోయింది. ఇది షుగర్ లెవెల్స్ మరింత పెంచుతుంది.
సో.. ఆల్రెడీ అన్నం మానేసి చపాతి తింటున్నవాళ్లు.. అన్నం స్థానంలో చపాతీ తినాలని నిర్ణయం తీసుకునేవాళ్లు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది. నిజంగా బరువు తగ్గాలంటే రాత్రి పూట అన్నం తగ్గించడంతో పాటు.. వ్యాయామాలు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.