అందరికీ తెలిసిన ఓ పిట్ట కథ మరోసారి గుర్తుచేసుకుందాం.
పులివస్తే పిలు అని చెప్పి వెళ్లాడట తండ్రి. అలా పిలిస్తే తండ్రి వస్తాడో..రాడో అని పరిక్షకు పిలిచాడట. తండ్రి వచ్చాడు. కొడుకు నవ్వాడు. ఇలా రెండు మూడు సార్లు జరిగింది.ఈసారి నిజంగానే పులి వచ్చింది. కొడుకు పిలిచాడు. తండ్రి రాలేదు. ఇక్కడ తప్పు ఎవరిది? రాని తండ్రిదా? అబద్దాలు ఆఢి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కొడుకుదా?
తెలుగునాట ఓ వర్గం మీడియా తంతు ఇదే. ఈ మీడియా జనాలను గొర్రెలు అనుకుంటుంది. తాము ఎలా ఆలోచించమంటే అలా ఆలోచిస్తుంది. ఎటు వెళ్లమంటే అటే వెళ్తుంది. ఎవరిని గెలిపించమంటే వారినే గెలిపిస్తుంది. ఎవరని ఓడించమంటే వారినే ఓడిస్తుంది అనీ వర్గపు మీడియాకు అపారనమ్మకం. నిజానికి చాలా కాలంగా ఇదే జరిగింది. కానీ జనాలకు రాను రాను వాస్తవం తెలిసివచ్చింది. ఈ వర్గపు మీడియా పరమార్థం వేరు అని. దాని కలాల రాతల వెనుక కులాల ఎజెండా వందని క్లారిటీ వచ్చేసింది.
అందుకే ఇక ఆ మీడియా వలలో పడకూడదని, దాని రాంగ్ డైరక్షన్ లోకి వెళ్లకూడదని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అది బాధ అయిపోతోంది. బాధ కాస్తా మాట వినడం లేదని దెప్పుళ్లుగా మారిపోతున్నాయి.
సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆర్కే ఈ వారం అలాగే తెగ బాధపడిపోతున్నారు. ఆంధ్రులు దేనికీ స్పందించడం లేదని, 'తెలుగు వీర లేవరా' అని పిస్తున్నారు. కానీ ఆంధ్రులుఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? వారిని తమ తెలివితేటలతో ఎడా పడా నడిపించి, రాంగ్ రూట్లోకి లేదా తమకు నచ్చిన రూట్లోకి తోసేసిన మీడియా కాదా?
ఎన్టీఆర్ ను కాంగ్రెస్ గద్దె నుంచి దింపింది. దీనికి ఎవరు సాయం చేసారు నాదెండ్ల భాస్కరరావు. కొంతమందిని చీల్చి, అధికారం తనదే అని గవర్నర్ దగ్గర క్లయిమ్ చేసి, అధికారంలోకి వచ్చారు. అప్పుడు జనం అంతా ఎన్టీఆర్ వెంట కదిలారు? ఎలా కదిలారు? ఇదే మీడియా నానా హడావుడి చేస్తే కదిలారు. నిజమే కదా, ఎన్టీఆర్ కు అన్యాయం జరిగింది. అందువల్ల మనం ముందుకు కదలాలి అని అనుకుని అడుగు ముందుకు వేసారు.
రాష్ట్రంలో మందు తాగి జనం చెడిపోతున్నారు. మద్యపానం నిషేధం అవశ్యం అని మీడియా ముందుకు కదిలింది. క్యాసెట్లు, జెండాలు అన్నీ వ్యాపారం అయిపోయింది.జనం కూడా నిజమే కదా అని నమ్మారు. ముందుకు కదిలారు. మద్యాపాన నిషేధం వచ్చింది.
జగన్ అనేవాడు పనికిరాడు. చంద్రబాబు అంటే అనుభవం పండించుకున్నవాడు అంటూ టముకేసారు. జనం నమ్మారు.
ప్రత్యక హోదా సాధించిన నాయుకుడు మన నాయుడు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఆయన పార్టీ కూడా వున్నా, ఆయన మాత్రం ఘనమైన నాయకుడు అని ఊదర గొట్టారు. జనం నమ్మారు. సన్మానాలు చేసారు.
కానీ సమస్య ఎక్కడ వచ్చింది అంటే జనాలకు ఇదే మీడియా ద్వంద్వ వైఖరి తెలిసివచ్చింది. నాదెండ్ల భాస్కరరావు పార్టీని చీల్చితే తప్పయింది. కానీ నాదెండ్ల పార్టీని చీల్చారు తప్ప, తనదే తెలుగు దేశం అని అడ్డగోలుగా వాదించలేదు. కానీ చంద్రబాబు పార్టీని చీల్చారు. పైగా తనదే అసలు తెలుగుదేశం అన్నారు. పార్టీ పెట్టినపుడు ఆయన పార్టీలోనే లేరు. మరి ఆయనది తెలుగుదేశం ఎలా అయింది. పార్టీని నిర్మించిన ఎన్టీఆర్ రోడ్ల పాలు ఎలా అయ్యారు. మరి అప్పుడు జనాన్ని ఎటు కదిలించారు. చంద్రబాబు దిశగా నడిపించారు. అప్పటికీ జనం మీడియా మాటలు నమ్మారు.
మద్యపానాన్ని చంద్రబాబు దశలు దశలుగా ఎత్తేసారు. మరి అప్పటి వరకు ఉద్యమం సాగించిన మీడియా మళ్లీ ఎందుకు దాన్ని తలకెత్తుకోలేదు. జనాన్ని ఎందుకు ఆ దిశగా నడిపించలేదు. అసలు మద్యపానం తలకెత్తుకున్నది తన ప్రత్యర్థి వ్యాపార మూలాలను తుంగలోకి తొక్కడానికి అని జనాలకు తెలిసి వచ్చింది.
అగ్రిగోల్డ్ పతనం వెనుక కూడా ఇలాంటి వ్యాపార పోటీ వుందని, రాత్రికి రాత్రి అగ్రిగోల్డ్ మీద చర్యలు తీసుకోవడం వెనుక ఇదే వ్యవహారం దాగి వుందని గుసగుసలు వున్నాయి. హాయ్ లాండ్ స్టూడియో, అగ్రిగోల్డ్ పచ్చళ్లు, నిత్యావసరం సరుకులు, అగ్రిగోల్డ్ మ్యాగ్ జైన్, ఇలా అన్నింటా తమకు పోటీ వస్తోందని కొందరు పెద్దలు భయపడడంతో, దాని తప్పులు అన్నీ అర్జెంట్ గా బయటకు పీకారు. మరి అలాంటి డిపాజిట్ల వ్యవహారమే మరొకళ్లది పైకి తీస్తే అది మీడియా మీద దాడి అంటూ నానా గత్తర చేసారు.
దీంతో మెల్ల మెల్లగా జనాలకు అర్థం అయింది ఈ మీడియాలను నమ్మాలో వద్దో? ఇప్పడు ఈ మీడియాలు నిజంగా పిలుపు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితి పోయింది. అమరవాతి వెనుక మీడియా కుల సమీకరణలు వున్నాయని జనం నమ్ముతున్నారు. అందుకే జనాలు ఈ మీడియా ఎంత యాగీ చేసినా పట్టించుకోవడం మానేసారు. చంద్రబాబు తప్ప మరో నాయకుడు లేడని ఈ మీడియా టముకు వేస్తుంటే జగన్ వున్నాడని నెత్తిన పెట్టుకున్నారు.
ఇప్పడు స్టీల్ ప్లాంట్, పెట్రోలు రాతలు కూడా చూడండి. ఈ రెండింటితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. నేరుగా మోడీని లేదా కేంద్రాన్ని విమర్శించాల్సి వుంది. కానీ ఈ మీడియాల రాతలు చూడండి. కేవలం తప్పంతా వైకాపాదే, జగన్ దే అని జనాలకు నూరిపోయాలని చూస్తోంది. అందుకే జనం స్పందించడం లేదు. ఇంత బర్నింగ్ సమస్య మీద జగన్ కేంద్రానికి గట్టి లేఖ రాసారు. మరి అంత ఆలోచన వున్న మీడియా ఆ లేఖను హైలైట్ చేయాలి కదా? తీసుకెళ్లి రెండో పేజీలో చిన్న వార్తకింద వదిలేసారు. ఎందుకంటే అది హైలైట్ అయితే విశాఖ జనం వైకాపాకు వ్యతిరేకం కారు కదా. విశాఖ మేయర్ ఎన్నికలో ఈ అంశం వాడుకోవడానికి వీలు కాదు కదా?
పాతిక ముఫ్ఫై ఏళ్లుగా విశాఖలో రాజకీయంగా, వ్యాపార పరంగా పాగా వేసిన వర్గానికి వైకాపా అధికారంలోకి వచ్చాక కాళ్లు చేతులు ఆడడం లేదు. అందుకే రాబోయే మేయర్ ఎన్నికల్లో చక్రం తిప్పడానికి మంచి అంశం దొరకింది. కానీ అది కేంద్రం తప్పు. అలా కాకుండా రాష్ట్రం చాతకానితనం కింద చిత్రీకరించాలన్నది ఈ మీడియా ఆలోచన. ఇదే మీడియా ఓ లేఖ కూడా రాయలేదని చంద్రబాబును ఎందుకు బాహాటంగా నేరుగా నిలదీయదు. ఎందుకు పెట్రోలు ధరల మీద ఓ ధర్నా కూడా చేయరని చంద్రబాబును, ఆయన పార్టీని గట్టిగా ప్రశ్నించదు. ఎందుకు తెలుగుదేశం ప్రతినిధులు ఢిల్లీలో ఓ ధర్నా లేదా ఓ నిరసన చేయరని గట్టిగా మొట్టికాయలు వేయదు.
ఎందుకంటే తప్పంతా వైకాపాది కావాలి. తేదేపా ఆల్టర్ నేటివ్ కావాలి. స్టీల్ ప్లాంట్ చలిమంటపై తేదేపా మేయర్ ఎన్నికకు చలికాచుకోవాలి. అది అసలు స్ట్రాటజీ. నిజానికి నిలదీయాల్సింది. సుజన చౌదరి లాంటి తేదేపా మూలాలున్న ఎంపీలను. ఆయనను నిలదీస్తూ ఎందుకు ఫ్రంట్ పేజీ వార్తలు వండి వార్చరు. అందుకే మనకుండే బంధాలు మనకు వున్నాయి కాబట్టి.
ఇలా ప్రతి చోటా తమకు బంధాలు వుంటే ఒకలా? లేదంటే మరొకలా వార్తలు వండి వార్చే ఈ మీడియా పద్దతి జనాలకు అర్థం అయిపోయింది కాబట్టి, వీళ్ల వార్తలను నిజమైనా, అబద్దమైనా నమ్మడం మానేసారు. ఇక వీళ్లు అరుచుకోవడమే మిగిలింది..'తెలుగు వీర లేవరా..లేవరా..లేవరా..' అని. చివరకు ఆయాసమే మిగులుతుంది.
విశాఖ జనాలకు తెలుసు ఎలా పోరాడాలో? ఎప్పుడు పోరాడాలో,.? ఇప్పటే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసారు. మరో ఎంపీ రాజీనామా చేస్తాం అంటున్నారు. అంతే తప్ప, ఈ సామాజిక మీడియాలు ఆయాసపడిపోనక్కరలేదు. పడినా ఆయాసమే మిగులుతుంది. నిజంగా ఆంధ్రులు లేస్తే..ఈ మీడియానే ముందు దూరం పెట్టాల్సి వుంటుంది.
ఆర్వీ