హీరో రాజ్ తరుణ్, దర్శకుడు విజయ్ కుమార్ కొండా కలిసి తొలిసారిగా 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాతో కలిశారు. ఆ టైమ్ లో ఇద్దరి మధ్య సింక్ బాగానే కుదిరినట్టుంది. వెంటనే మరో సినిమా చేసేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండో ప్రయత్నంగా తెరకెక్కింది పవర్ ప్లే సినిమా.
అయితే వీళ్ల కాంబో ఇక్కడితో ఆగేలా లేదు. ఇద్దరూ కలిసి అతి త్వరలో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని హీరో రాజ్ తరుణ్ స్వయంగా ప్రకటించాడు.
తొలి ప్రయత్నంగా ఈ హీరో, దర్శకుడు కలిసి లవ్ స్టోరీ చేశారు. రెండో ప్రయత్నంగా థ్రిల్లర్ జానర్ టచ్ చేశారు. అదింకా రిలీజ్ కాకముందే, ఇప్పుడు మూడో సినిమా ప్రకటన చేశారు. త్వరలోనే తామిద్దరి నుంచి మరో సర్ ప్రైజింగ్ మూవీ చూస్తారని చెబుతున్నాడు రాజ్ తరుణ్.
రాజ్ తరుణ్ ప్రకటన చూస్తుంటే.. ఈసారి ఈ ఇద్దరూ కలిసి ఇంకో కొత్త జానర్ ప్రయత్నించడానికి ఫిక్స్ అయినట్టున్నారు. 'పవర్ ప్లే' థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఆ మూడో సినిమాపై మరింత స్పష్టత వస్తుంది. పవర్ ప్లే హిట్టయినా, అవ్వకపోయినా మూడో సినిమా చేయడానికే వీళ్లు మొగ్గుచూపుతున్నారు.