హీరోయిన్లను, క్లబ్ డ్యాన్సర్లను సంఘ సేవికలుగా అభివర్ణించాడు ఒక సినిమాలో త్రివిక్రమ్. ఎండనక, వాననకా ఏ లొకేషన్లలో పడితే ఆ లొకేషన్లలో చాలీచాలని బట్టలేసుకుని డ్యాన్సులేస్తూ, నటిస్తూ జనాలను అలరించే వాళ్లను సంఘసేవకులుగా అనడంలో తప్పేటంటూ.. డైలాగ్ రైటర్ గా తన తొలి సినిమాలోనే త్రివిక్రమ్ లాజిక్ అడిగాడు. హీరో వేణూ ఆ సినిమాలో ఆ డైలాగ్ చెబుతాడు.
మరి అలాంటి సంఘసేవికల్లో గుర్తింపు లేక, వెనుకబడిపోయిన వారి ఉద్ధరణకు పథకాన్ని ఒకటి తన సినిమాల ద్వారా కొనసాగిస్తున్నట్టుగా ఉన్నాడు త్రివిక్రమ్. స్వయంవరంలో హీరో వేణూ చెప్పే ఆ డైలాగ్స్ లో నదియా పేరు కూడా ప్రస్తావించాడు త్రివిక్రమ్. అంత స్టార్ హీరోయిన్ కాలేకపోయిన నదియాను ఆ తర్వాత చాలా కాలం తర్వాత అత్తారింటికీ దారేదీతో ఫుల్ బిజీ చేశాడు ఈ దర్శకుడు. తమిళంలో తల్లితరహా పాత్రలు కొన్ని చేసినా, నదియాకు మిర్చి, అత్తారింటికీ దారేదీతో ఫుల్ గా అవకాశాలు వచ్చాయి.
ఇక మాజీ హీరోయిన్లను, ఒకప్పటి గ్లామర్ డాల్స్ ను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మార్చడం త్రివిక్రమ్ మాత్రమేగాక వేరే దర్శకులు కూడా చేస్తూ ఉన్నారు. కస్తూరి, సితార, సుకన్య, రోహిణి లతో సహా అనేక మంది మాజీ హీరోయిన్లు..గత దశాబ్ద కాలంలో తెరపై తల్లులు, అత్తల పాత్రల్లో అలరించారు. వీరందరితో ఆ పాత్రలకు కొత్త గ్లామర్ వచ్చింది. గతంలో అయితే అన్నపూర్ణ, నిర్మలమ్మ, సుధ.. వీళ్లే ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా అయ్యే వారు.
అక్క, వదిన, అమ్మ, అత్త, పిన్ని పాత్రలకు ఎన్ని సినిమాల్లో అయినా కొంతమంది నటీమణులే రిపీట్ అయ్యే వారు. గత దశాబ్దంలో మాత్రం ఈ పాత్రలను బోర్ కట్టనీయని రీతిలో… మార్చారు దర్శకులు. కొరటాల శివ, బోయపాటి.. వంటి వాళ్లు కూడా మాజీ హీరోయిన్లను ఈ క్యారెక్టర్ రోల్స్ లో చూపించడానికి, మరిచిపోయిన వాళ్లను తెరపైకి తెచ్చి కొత్త ఫీల్ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమెరికాలో సెటిలైన లయను కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు కొన్ని జరిగాయంటారు.
అయితే త్రివిక్రమ్ కు ఆమె నో చెప్పిందని టాక్. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు త్రివిక్రమ్ రాతలో ఒక సినిమా చేసిన అన్షూను తీసుకొస్తున్నారట. రాఘవేంద్ర, మన్మథుడు వంటి సినిమాల్లో చేసిన అన్షూను త్రివిక్రమ్ తదుపరి సినిమాలో ఒక పాత్రకు తీసుకుంటున్నారట. మొత్తానికి తెలుగు దర్శకులు మాజీ హీరోయిన్ల ఉద్ధరణ పథకాన్ని అమలు చేస్తూ.. తమ సినిమాలకు పాత వాళ్లతో కొత్త ఫీల్ ను తీసుకొచ్చే ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నట్టున్నారు.