ఎప్పటి నుంచో వార్తల్లో నలుగుతున్న కాంబినేషన్ ఒకటి వుంది. మహేష్ బాబు-రాజమౌళి ల కాంబినేషన్ అది. ఆర్ఆర్ఆర్ విడుదల దగ్గరకు వస్తుండడంతో, ఇక తరువాత సినిమా అదే అని వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
రాజమౌళి తరువాత సినిమా అదే కావచ్చు. కానీ మహేష్ బాబు కు ఎన్నో సినిమా అవుతుంది అన్నదే పాయింట్. ప్రస్తుతం చేస్తున్న సర్కారువారి పాట తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయాల్సి వుంది.
కానీ గాలిసంపత్, ఎఫ్ 3 సినిమాల రిజల్ట్ మీద అది ఆధారపడి వుంటుంది. అనిల్ రావిపూడి సినిమా చేసిన వెంటనే రాజమౌళి సినిమా వుండదు అని, ఇంకో మరో సినిమా చేసిన తరువాతే దాని సంగతి అని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి సినిమా వున్నా కూడా, తరువాత మరో సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నారని బోగట్టా. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక చాయిస్ వుండనే వుంది. రెండు వైపులా ఈ సినిమా మీద ఇంట్రస్ట్ గానే వున్నారు.
త్రివిక్రమ్ సినిమా సెట్ కాకపోతే, పూరి జగన్నాధ్ తో అయినా ఓ సినిమా చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ ను ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
అందువల్ల ఈ రెండు కాంబినేషన్లు చేసాకే రాజమౌళి సినిమా మీదకు వెళ్తారని, ఒకసారి రాజమౌళి సినిమా మీదకు వెళ్తే మూడేళ్ల వరకు మళ్లీ సినిమా వుండదని వార్తలు వినిపిస్తున్నాయి.