దశాబ్దం క్రితం నుంచి ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే మాట తరచూ వినిపిస్తూ ఉంది. అయితే వెస్ట్రన్ కల్చర్ దేశాలతో పోలిస్తే.. ఇప్పటికీ లివ్ ఇన్ రిలేషన్ షిప్ ల శాతం చాలా చాలా తక్కువే. కానీ.. గత దశాబ్దకాలంలో నగర నాగరకతలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ ల స్థాయి పెరిగిందని మాత్రం ఒప్పుకోక తప్పదు!
ప్రస్తుతానికి వస్తే.. ఓ మోస్తరు పట్టణంలో చదువులు పూర్తి చేసి, మహానగరాలను చేరి అక్కడ ఏ ఉద్యోగమో సంపాదించాకా.. నచ్చిన వారితో కలిసి జీవించడానికి కొంతమంది అమ్మాయిలు- అబ్బాయిలు వెనుకాడటం లేదు! ఆ స్థాయి వరకూ చేరాకా ప్రేమకథలు చాలా మందికే ఉన్నా.. వారిలో కలిసి నివసించడం లేదా కలిసి జీవించడం వైపు మొగ్గు చూపే వారి శాతమూ కొంత మేర పెరిగింది.
అయితే ఓ మోస్తరు పట్టణాల్లోనూ, పల్లెల్లో అయితే లివింగ్ రిలేషన్ షిప్ ల ఊసు తరచి చూసినా పెద్దగా కనపడదు. అంటే.. అవకాశం చిక్కినప్పుడు ఒక ఇంట్లో ఉండటం, కలిసి కోరికలు తీర్చుకునే రకాలు కూడా లివింగ్ కేటగిరిలోకి రావు అనే అనాలి. సూటిగా చెప్పాలంటే కలిసి కాపురం పెట్టేయడమే లివిన్ రిలేషన్ షిప్. పెళ్లితో సంబంధం లేకుండా కలిసి జీవించే వాళ్లను, దాన్ని ధృవీకరించగలిగే వాళ్లను లివిన్ లో ఉన్నారని అనాలి. ధృవీకరించకుండా గడిపే వాళ్లు ఈ కేటగిరిలోకి రారు!
ప్రధానంగా సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఈ నైజం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది ఇండియాలో అయితే! ఉత్తరాది నుంచి దక్షిణాది నగరాలకు ఉద్యోగాల కోసం వచ్చిన వారిలో కొందరు సిటీల్లో ఇలా కనిపిస్తారు. అలాగే తెలుగు వాళ్లు, తమిళులు, కన్నడీగులు కూడా.. ఒక సిటీకి అంటూ చేరాకా అక్కడ ఇలాంటి కాపురాలు పెట్టిన వైనాలు ఎవరి ఎరుకలో అయినా ఉంటాయి ఈ రోజుల్లో! పాతికేళ్ల వయసుకు వచ్చాకా.. ధైర్యంగా తమ ప్రేమకథను కలసి జీవించడం వరకూ తీసుకెళ్తున్న వారున్నారు! అయితే.. ఇండియాలో ఇప్పటికైతే లివిన్ రిలేషన్ షిప్ అనేది పెళ్లికి ప్రత్యామ్నాయం కావడం లేదు!
చాలా మంది యువతీయువకులు ప్రేమ వైపు మొగ్గుచూపే రోజులు ఇవి. అయితే ఇదే సమయంలో ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ ల శాతం కూడా మెజారిటీ గా ఉంది! ఇలాంటప్పుడు లివిన్ రిలేషన్ షిప్ అనేది ఒకటీ అర శాతం యువతీయువకుల ఎంపికగా మిగిలింది. కులం, గోత్రాలు చూసుకునే పెళ్లిళ్లు చేసుకునే వారే గణనీయంగా ఉన్నారు. ప్రేమలు కూడా ఇలానే చేసే వారికి లోటు లేదు! ఒకవేళ ప్రేమించుకున్నా.. దాన్ని లివ్ ఇన్ రిలేషన్ షిప్ గా మార్చడం కన్నా.. పెద్దలను ఒప్పించో, ఒకవేళ ఒప్పించలేకపోతే సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకునే వారూ ఉన్నారు! అయితే పెళ్లే లేకుండా.. లివిన్ అంటే మాత్రం ఇంకా సంకోచాలు చాలా ఉన్నాయి భారతీయ యువతలో!
ఇక మరో కేటగిరి ఉంది.. అది అనధికారిక లివిన్ రిలేషన్ షిప్. ఇది అవసరం మేరకో, కోరికలను తీర్చుకోవడానికో చేసే కాపురం. తాత్కాలికం! ప్రేమలో ఉన్నాం కాబట్టి.. ఇంట్లో వాళ్లకూ తెలియకుండా, సిటీల్లో ఉన్నాం కాబట్టి.. ఫ్రెండ్స్ తో ఉన్నాం అని చెప్పేసి .. ఎక్కడో ఒక చోట మకాం పెట్టడం. కాపురం చేసే వాళ్ల లాగానే గడిపేయడం. కుదిరితే ఆ ప్రేమ కథలు పెళ్లి వరకూ వెళ్తాయి లేకపోతే ఇద్దరూ ఇల్లు ఖాళీ చేయడంతో.. ఆ కథ అలా ముగుస్తుంది! వీరికి కేవలం పేరెంట్స్ అంటే భయంతోనో, లేదా తమ ప్రేమకథపై అయినా నమ్మకం లేకనో.. తాత్కాలిక ఆవాసంలా లివ్ ఇన్ లో ఉంటూ.. ఆ తర్వాత వేరే మార్గాలు దొరికినప్పుడు చెరో వైపుకు వెళ్లే వారు ఉంటారు. లివ్ ఇన్ లో ఉండటం పాపం అనే భావన సొసైటీలో ఉంది. దానికి పెద్దల సమ్మతి పెద్దగా లేదు ఇప్పటికీ ఇండియాలో! చట్టపరమైన సమ్మతి అయితే ఉన్నట్టే కానీ, వీరి మధ్య కలతలు వచ్చినప్పుడు కోర్టులు ఎప్పుడు ఏం తీర్పులు ఇస్తాయో ఎవరికీ తెలీదు!
పరస్పరం సమ్మతితో మూడో కంటికి ఎరుక లేకుండా కలిసి జీవించే వాళ్లు తమలో తమకు చెడినప్పుడు కేసులు అంటూ వార్తల్లోకి వస్తూ ఉంటారు. రేప్ కేసులను పెట్టుకునే దాఖలాలూ కనిపిస్తూ ఉంటాయి. తగిన పెళ్లి వయసు వచ్చిన యువతీయువకుల లివింగ్ కు కోర్టులకు అభ్యంతరాలు లేవు. అయితే హింస, రేప్ వంటి కేసులు వచ్చినప్పుడు ఇతమిద్ధంగా చట్టాలు ఎలా పని చేస్తాయో చెప్పడం కష్టం. మ్యారిటల్ రేప్, గృహహింస విషయంలోనే ఒక్కో కోర్టు ఒక్కోలా స్పందించిన దాఖలాలు ఉన్నాయి.
ఈ మధ్యనే మ్యారిటల్ రేప్ విషయంలో ఒక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా నిలిచింది. మ్యారిటల్ రేప్ కు భారత వ్యవస్థలు సరైన నిర్వచనాలు ఇవ్వలేకపోతూ ఉన్నాయి. అలాగే గృహహింస చట్టాలు కూడా ఒక్కోసారి అడ్డం తిరుగుతూ ఉంటాయి. ఆ చట్టాలను ఉపయోగించుకుని అన్నెం పున్నె ఎరగని అత్తమామలను, ఆడపడుచులనూ, ఆడపడుచులను ఆటాడించే కోడళ్లూ లేకపోలేదు మన దగ్గర! మరి చట్టపరంగా చూస్తే.. వైవాహికబంధంలో వ్యవహారాలనే వ్యవస్థలు తగురీతిన కాపుగాయలేకపోతున్నాయి! ఇలాంటప్పుడు లివింగ్ లో రచ్చలు రేగితే అవి తేలడం కూడా తేలిక కాదు!
ప్రస్తుత సమాజస్థితిగతులను చూస్తే.. ఇండియాలో లివింగ్ రిలేషన్ షిప్ లకు కొదవలేదు. అయితే పెళ్లితో పోల్చినప్పుడు లివిన్ రిలేషన్ షిప్ శాతం చాలా చాలా తక్కువ! అలా కలిసి జీవిస్తున్న వారిలో కూడా తాము అలా ఉంటున్నామని అధికారికంగా ప్రకటించుకునే శాతం ఇంకా తక్కువ!
జాయిన్ అవ్వాలి అంటే