స్టేషన్‌ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలకు పోలీసులు ఎట్టకేలకు ముగింపు పలికారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన రాజయ్యపై లైంగిక ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే రాజయ్య తనతో పలు సందర్భాల్లో అసభ్యంగా ప్రవర్తించారని, కూతురు లాంటి తనకు వేళకాని వేళలో వాట్సప్ కాల్ చేస్తూ వేధిస్తున్నాడని నవ్య గత కొన్ని నెలలుగా మీడియా ముఖంగా ఆవేదన, ఆగ్రహంతో కూడిన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల రూ.25 లక్షల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. గతంలో తాను చేసిన లైంగిక ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేశానని తనతో అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించే కుట్ర జరుగుతోందని రాజయ్యతో పాటు తన భర్త ప్రవీణ్ తదితరులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. నవ్య ఆరోపణలు బీఆర్ఎస్‌కు నష్టం కలగించేలా వుండడంతో తెలంగాణ మహిళా కమిషన్ అప్రమత్తమైంది.
అలాగే కేంద్ర మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. దీంతో నవ్య లైంగిక ఆరోపణలకు ముగింపు పలికేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నవ్యకు కాజీపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. తన దగ్గర ఆడియో రికార్డులు, ఇతరత్రా ఆధారాలున్నాయని ఇంత కాలం నవ్య చెబుతూ వచ్చారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే రాజయ్య ఇరుక్కుంటారని అంతా భావించారు.
అయితే కాజీపేట ఏసీపీ ఇచ్చిన మూడు రోజుల గడువులో నవ్య ఆధారాలు సమర్పించలేదు. దీంతో నవ్య ఆరోపణల్లో వాస్తవం లేదని కాజీపేట పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో తెలంగాణ మహిళా కమిషన్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు కాజీపేట ఏసీపీ సమర్పించడం గమనార్హం. మరి ఇంతటితో నవ్య లైంగిక ఆరోపణల ఎపిసోడ్ ముగిసిపోతుందా? లేక మరో రూపం తీసుకోనుందా? అనేది తేలాల్సి వుంది.