ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు తప్పవా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇవాళ ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే … కేంద్ర పెద్దలే జగన్‌ను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. జగన్ కోరుకున్న అపాయింట్‌మెంట్ ఎంత మాత్రం కాదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌తో ప్రధాని మోదీ, అమిత్‌షా చర్చించేందుకు పిలిపించుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేదే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన. మూడు లేదా నాలుగు నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లాలని మోదీ, అమిత్‌షా వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.
ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి వుంది. షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాలి. వివిధ కారణాల రీత్యా లోక్‌సభ ఎన్నికలను ముందుగా జరపాలని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఆలోచిస్తోంది. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభతో పాటు జరిపేలా జగన్‌ను ఒప్పించేందుకు మోదీ, అమిత్ షా పిలిపించుకున్నారని సమాచారం.
కేంద్రం ఓకే అంటే… జగన్ కాదనే ప్రశ్నే తలెత్తదు. ఈ మేరకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధంగా వుండాలని పార్టీ శ్రేణులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్, కోడ్, ఎన్నికల తేదీలు ఎప్పుడు ఉండొచ్చనే విషయమై అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ముందస్తు కథ వుందనేది వాస్తవం.