నీతులు చెప్పడంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తర్వాతే ఎవరైనా! పాలక, ప్రతిపక్ష పార్టీలను నిలదీయడమో, భుజాన మోయడమో తప్ప, ప్రజల పక్షాన పోరాటం చేయాలన్న స్పృహ వామపక్ష పార్టీల్లో కొరవడింది. అడపాదడపా తప్ప, ప్రజల పక్షాన నిలబడడం మానేశారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తొలగింపుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్‌పై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
ఇవాళ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి అనుకూలంగా వీర్రాజు పని చేశారన్న భావన వుందన్నారు. అందుకే ఆయన్ను తప్పించి పురందేశ్వరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారన్నారు. చంద్రబాబు పల్లకీ మోయడంలో సీపీఐ నేత రామకృష్ణ ముందు వరుసలో ఉన్నారనే విమర్శ వుంది. అంతేకాదు, సీపీఐ అంతర్గత సమావేశాల్లో కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణకు బలంగా చేకూర్చేలా రామకృష్ణ నడుచుకుంటున్నారని, ఆ పద్ధతి మార్చుకోవాలని సొంత పార్టీ నేతలు హితవు చెప్పినట్టు వార్తలొచ్చాయి.
అయినప్పటికీ సీపీఐ నేత రామకృష్ణ తన రాజకీయ పంథా మార్చుకోలేదు. రాజధాని విషయంలో పెట్టుబడుదారులకు అనుకూలంగా రామకృష్ణ వత్తాసు పలుకుతున్నారని, ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే అంతంత మాత్రంగానే ఉన్న సీపీఐని కాస్త వెన్నెముక ఉన్న పార్టీగా కాపాడుకునే ప్రయత్నం కూడా జరగడం లేదు.
ఇదే బీజేపీ విషయానికి వస్తే, సోము వీర్రాజు పదవీకాలం ముగిసిన వెంటనే ఆయన్ను మార్చేశారు. వీర్రాజు అంటే గిట్టని వాళ్లు ఆయనపై ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు. ఒకవేళ వైసీపీతో అనుకూలంగా ఉండడం వల్లే వీర్రాజును తప్పించారనే ప్రచారం నిజమే అనుకుందాం. బీజేపీ చూపిన చిత్తశుద్ధిని సీపీఐ ఎందుకని ప్రదర్శించలేకపోతోందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
చంద్రబాబు జేబు మనిషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణను తొలగించి జి.ఓబులేసు, సత్యనారాయణమూర్తి, ఈశ్వరయ్య తదితరులను ఎందుకు నియమించడం లేదనే నిలదీత ఎదురవుతోంది. అందుకే సీపీఐ రోజురోజుకూ పతనమవుతోందని నెటిజన్లు చీవాట్లు పెట్టడం గమనార్హం.