చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీ ప‌త‌నావ‌స్థ‌!

రాష్ట్రంలో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో, తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్న పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవం అయిన వాటిల్లో అత్య‌ధికం చిత్తూరు జిల్లాలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం! రాష్ట్రం మొత్తం మీదా తొలి విడ‌త‌లో అత్య‌ధిక పంచాయ‌తీలు  ఏక‌గ్రీవం…

రాష్ట్రంలో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో, తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్న పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవం అయిన వాటిల్లో అత్య‌ధికం చిత్తూరు జిల్లాలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం! రాష్ట్రం మొత్తం మీదా తొలి విడ‌త‌లో అత్య‌ధిక పంచాయ‌తీలు  ఏక‌గ్రీవం అయిన జాబితాలో తొలి స్థానంలో నిలిచింది చిత్తూరు జిల్లా. 

చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు తొలి విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. అందులో 110 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి. దాదాపు నాలుగో వంతు పంచాయ‌తీల‌కు ఎన్నిక ఏక‌గ్రీవంగా ముగియ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి నాలుగు పంచాయ‌తీల్లో ఒక‌టి ఏక‌గ్రీవంగా ముగియ‌డం చెప్పుకోద‌గిన విశేషం. అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితిని చాటుతోంది ఈ ప‌రిణామం.

పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీల ర‌హితంగా జ‌రుగుతాయి. అయితే పార్టీలు పూర్తిగా స‌మ‌సిపోవు. ప్ర‌తి ఊర్లోనూ ప్ర‌తి పార్టీకీ అభిమానులు ఉంటారు. పార్టీల త‌ర‌ఫున తిర‌గ‌డాన్నే వృత్తిగా, ప్ర‌వృత్తిగా క‌లిగిన వారు ఉంటారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీల మ‌ద్ద‌తుదార్లే బ‌రిలోకి దిగుతారు. పార్టీల ర‌హితంగా జ‌రుగుతాయ‌ని చెప్పి వీటికి ఎక్క‌డి నుంచినో పోటీ దారులు రారు. 

ఒకే పార్టీలో రెండు మూడు గ్రూపులు, ఒక పార్టీ వాళ్ల‌కు మ‌రొక‌రు స‌పోర్ట్ చేసే ఉదంతాలు కొన్ని ఉంటాయి కానీ, పార్టీల వారీగా విభ‌జ‌నే గ‌ట్టిగా ఉంటుంది. ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల‌ను పార్టీల విష‌యంలో అంత సీరియ‌స్ గా తీసుకోక‌పోయినా రాజ‌కీయ నేత‌లు మాత్రం వీటిని రాజ‌కీయంగానే తీసుకుంటారు.

ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నేత‌లు.. ఎన్ని పంచాయ‌తీల్లో త‌మ మ‌ద్ద‌తుదారుల‌ను గెలిపించుకోవ‌డం అనేది ప్ర‌తిష్టాత్మ‌క అంశంగా కొన‌సాగుతూ ఉంటుంది. ఇది ఎమ్మెల్యేల‌కు ప్రిస్టేజ్ ఇష్యూ అయ్యి చాలా కాలం అయ్యింది. పంచాయ‌తీ అభ్య‌ర్థుల‌తో మూకుమ్మ‌డి నామినేష‌న్లు వేయించ‌డం, హ‌డావుడి చేయ‌డం.. ఇదంతా ఏపీలో జ‌రిగిన‌ది, జ‌రుగుతున్న‌దే. 

తెలుగుదేశం పార్టీ అయితే ఈ ఎన్నిక‌ల‌కు ఏకంగా మెనిఫెస్టోనే విడుద‌ల చేసింది. ఆ మెనిఫెస్టోకి ప్రెసిడెంట్లు ఏ ర‌కంగానూ బాధ్యులు కారు. అయినా చంద్ర‌బాబు నాయుడు త‌న మార్కు చీప్ రాజ‌కీయాన్ని చేసి, పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు మెనిఫెస్టోను విడుద‌ల చేసి మ‌రింత ప‌లుచ‌న అయ్యారు.

ఇలా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ఎన్న‌డూ లేని రీతిలో, ఎవ్వ‌రూ చేయ‌ని రీతిలో మెనిఫెస్టోను విడుద‌ల చేసి న‌వ్వుల పాలైన చంద్ర‌బాబు నాయుడుకు ఝ‌ల‌క్ ఏమిటంటే.. ఆయ‌న సొంత జిల్లాలో అత్య‌ధిక ఏక‌గ్రీవాలు న‌మోదు కావ‌డం. ఇవే ఏక‌గ్రీవాలు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో న‌మోదు అయి ఉంటే.. అప్పుడు టీడీపీ మ‌రోలా రియాక్ట్ అయ్యేది. 

క‌డ‌ప‌లో బెదిరించి ఏక‌గ్రీవాలు చేసుకున్నార‌ని, రౌడీయిజం, ఫ్యాక్ష‌నిజం చేశారంటూ తెలుగుదేశం పార్టీ బ‌హిరంగ వ్యాఖ్యానాల‌కు దిగేది. త‌మ మ‌ద్ద‌తుదార్ల‌ను బెదిరించి నామినేష‌న్ల‌ను వేయనివ్వ‌లేద‌ని అంటూ దుమ్మెత్తి పోసే వాళ్లు. అయితే.. అత్య‌ధిక నామినేష‌న్లు చిత్తూరు జిల్లాలో, చంద్ర‌బాబు సొంత జిల్లాలో జ‌రిగాయి. 

ఈ విష‌యంలో టీడీపీ క‌క్క‌లేని మింగ‌లేని స్థితిలో ఉంది. ఆ ఏక‌గ్రీవాలు అన్నీ త‌మవే అని టీడీపీ చెప్పుకోనూ లేదు. ఎందుకంటే ఆ పార్టీ కి చిత్తూరు జిల్లాలో అంత సీన్ లేద‌ని అంద‌రికీ తెలుసు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే చిత్తూరు జిల్లాలో టీడీపీ పూర్తి ప‌త‌నావ‌స్థ‌లోకి కూరుకుపోయింది. చంద్ర‌బాబు నాయుడి మెజారిటీనే హ‌రించుకుపోయింది. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి పోటీ చేయ‌డానికి కూడా చంద్ర‌బాబు నాయుడు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి త‌రుణంలో గ్రామ‌స్థాయిల్లో టీడీపీ కోస‌మంటూ నామినేష‌న్ వేయ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్టుంది. ప్ర‌తి నాలుగు ప‌ల్లెల్లోనూ ఒక చోట ఈ ప‌రిస్థితి ఉందంటే.. చిత్తూరు జిల్లాలో టీడీపీ క‌థ కంచికి చేరిన‌ట్టుగా స్ప‌ష్టం అవుతూ ఉంది.

అనంత‌పురం వంటి జిల్లాలో కూడా టీడీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఆ జిల్లాలో కేవ‌లం ఆరు పంచాయ‌తీలు మాత్ర‌మే ఏక‌గ్రీవం అయ్యాయి. వాటిల్లో కూడా తండా పంచాయ‌తీలే ఎక్కువ‌. తండాల్లో గ్రూపుల గోల ఎక్కువ‌గా ఉండ‌దు కాబ‌ట్టి.. తండా పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయిన‌ట్టున్నాయ‌క్క‌డ‌. అదే ఇత‌ర పంచాయ‌తీల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి గ్రామంలోనూ టీడీపీ మ‌ద్ద‌తుదార్లు నామినేష‌న్ లు వేయించుకోగ‌లిగారు. 

టీడీపీ త‌ర‌ఫున తిరిగిన వారిలో ఎవ‌రో ఒక‌రు ప్ర‌తి పంచాయ‌తీలోనూ బ‌రిలోకి నిల‌బ‌డ‌గ‌లిగారు. ద‌శాబ్దాలుగా అక్క‌డ బీసీల్లో ప‌ట్టు ఉన్న టీడీపీ దాన్ని నిల‌బెట్టుకోగ‌లిగింద‌ని అక్క‌డ స్ప‌ష్టం అవుతోంది. అంటే రూట్స్ లో టీడీపీ ఇంకా పూర్తి దెబ్బ‌తిన‌లేద‌క్క‌డ‌. 

టీడీపీ మ‌ద్ద‌తుదార్లు ఏ మేర‌కు గెలుస్తారు అనేది ప‌క్క‌న పెడితే, మ‌రీ నామినేష‌న్ల‌ను వేయించుకోలేని ప‌రిస్థితుల్లో అయితే ఆ జిల్లాలో లేదు. అనంత‌పురం జిల్లాలో అతి త‌క్కువ ఏక‌గ్రీవాలు టీడీపీ ఉనికికి నిద‌ర్శ‌నం అయితే, చంద్ర‌బాబు సొంత జిల్లాలో అత్య‌ధిక ఏక‌గ్రీవాలు టీడీపీ ప‌త‌నావ‌స్థ‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

ఇక వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో 206 పంచాయ‌తీల‌కు గానూ 51 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక్క‌డ కూడా దాదాపు చిత్తూరు జిల్లా నిష్ఫ‌త్తిలోనే ఏక‌గ్రీవాలు జ‌రిగాయి. స‌గ‌టున తీసుకుంటే ఇక్క‌డా ప్ర‌తి నాలుగు పంచాయ‌తీల్లో ఒక చోట ఏక‌గ్రీవం జ‌రిగింది.

క‌ర్నూలులో మాత్రం మ‌ళ్లీ పోటాపోటీ ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. 727 పంచాతీయ‌ల‌కు గానూ 52 పంచాయ‌తీలు మాత్ర‌మే అక్క‌డ ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక్క‌డ కూడా గ్రామాల్లో టీడీపీ త‌గిన పోటీ ఇస్తున్న‌ట్టే.

ఇక పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు ప్ర‌చార ప‌ర్వంలో మాత్రం పార్టీల ప్ర‌స్తావ‌న‌ను పెద్ద‌గా తీసుకురారు. త‌మ‌కు ఒక పార్టీ మ‌ద్ద‌తు ఉన్నా… ఊర్లో ఉన్న ప‌రిచ‌యాలు, బంధుత్వాల ఆధారంగానే ఎక్కువ‌గా ప్ర‌చారం చేసుకుంటారు. ప్ర‌జ‌లు కూడా ఓటింగ్ వ‌ర‌కూ వ‌స్తే.. పార్టీల‌కు కొంత వ‌ర‌కూ ప్రాధాన్య‌త‌ను ఇచ్చినా, పోటీలో ఉన్న వ్య‌క్తుల‌తో త‌మ మిత్ర‌, శ‌త్రుత్వాల‌కు, వారిపై త‌మ‌కున్న అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇచ్చే అవ‌కాశం ఉంది.

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్