చంద్రబాబునాయుడు, లోకేశ్ పదేపదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, చెల్లి ప్రస్తావన తెస్తున్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి… సమాజానికి ఏం చేస్తారంటూ నిలదీస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుల్ని జగన్ పట్టించుకోరని, అలాంటప్పుడు ప్రజల యోగక్షేమాలను ఎలా పట్టించుకుంటారనే నెగెటివ్ ఆలోచనను ఇంజెక్ట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తోంది.
ఇదే సందర్భంలో టీడీపీ నేతలకు వైసీపీ గట్టిగా సమాధానం ఇస్తోంది. పిల్లనిచ్చిన మామనే అధికారం కోసం వెన్నుపోటు పొడిచి, మానసికంగా హింసించి, ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన చంద్రబాబునాయుడు, ఇవేవీ తెలియని మాలోకం లోకేశ్ జనాన్ని ఉద్ధరిస్తారా? అంటూ కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ నాడు చేసిన ఘాటు కామెంట్స్‌ను విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు, లోకేశ్ తమ గురించి లోకానికి ఏమీ తెలియదన్నట్టుగా, నీతులు చెబుతూ సీఎం జగన్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే వైసీపీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం నిత్యం జగన్ కుటుంబంలోని మహిళల గురించి ప్రస్తావిస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో చంద్రబాబు, లోకేశ్ ఆరితేరారు.
రాజకీయ భవిష్యత్ ఇచ్చిన మామకు తన తండ్రిలా వెన్నుపోటు పొడిచిన మరే నాయకుడు లేరని లోకేశ్‌కు తెలియదని అనుకోవాలా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ తల్లి, చెల్లి పై వేలెత్తి చూపేటప్పుడు, మిగిలిన నాలుగు వేళ్లు తన వైపు ఉన్నాయని లోకేశ్ గ్రహిస్తే మంచిదని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు.