వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా పార్టీని బలోపేతం చేసే పనిలో విజయసాయిరెడ్డి మునిగారు. దీంతో తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పాతవాళ్లలో కొందర్ని సాగనంపి, కొత్త వారిని తెచ్చుకోడానికి రెడీ అయ్యారు.
పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును తిరిగి కేంద్ర కార్యాలయానికి ఇటీవల రప్పించుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రౌండ్ ప్లోర్‌లో ఉమ్మారెడ్డికి ప్రత్యేక గదిని కేటాయించి, పార్టీ కార్యకలాపాలను చూసేలా బాధ్యతలు అప్పగించారు. అలాగే నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తికి ప్రాధాన్యం తగ్గించారు. కేంద్ర కార్యాలయంలో నారాయణమూర్తికి అప్రాధాన్యం ఉన్న గదిని కేటాయించి, మొక్కుబడిగా ఇన్వాల్వ్ చేశారని సమాచారం.
అలాగే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మేనేజర్‌ను మచిలీపట్నంకు పంపినట్టు సమాచారం. వైసీపీ అనుబంధ విభాగాలను బలోపేతం చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అనుబంధ విభాగాల ప్రక్షాళనకు విజయసాయిరెడ్డి ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే ఏర్పాటైన నియామకాలను కొనసాగిస్తూ, కొత్తగా ఉపాధ్యక్షులను తెరపైకి తీసుకురానున్నారు. ఉపాధ్యక్షుల్లో తన వాళ్లను పెట్టుకుని చక్రం తిప్పనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీలైన మేరకు తన ముద్ర వేసేందుకు విజయసాయిరెడ్డి దృష్టి సారించారని సమాచారం.